ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా వేలం తర్వాత దీని గురించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
మనదేశంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించాలని అనుకుంటున్నట్లు గంగూలీ పేర్కొన్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఆ సమయానికి కోవిడ్ కేసులు తగ్గితే మాత్రమే ఇది జరుగుతుందని ఏబీపీతో అన్నారు.
ఏఎన్ఐ తెలుపుతున్న దాని ప్రకారం.. ముంబైలోని వాంఖడే స్టేడియం, పుణేలోని డీవై పాటిల్ స్టేడియంల్లో ఐపీఎల్ 15వ సీజన్ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022లో 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అహ్మదాబాద్, లక్నో జట్లు కొత్తగా బరిలోకి దిగనున్నాయి.
అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హార్దిక్‌తో పాటు రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను అహ్మదాబాద్ ఎంచుకుంది. ఇక లక్నో విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. రాహుల్‌తో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను లక్నో తమ జట్టులోకి తీసుకుంది.
ఐపీఎల్ తర్వాతి సీజన్‌కు అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 1214 ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో మొత్తం 270 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 903 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 318 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మొత్తం 1214 మందిలో 217 మందిని ఫ్రాంచైజీలు ఎంచుకోవచ్చు.