IPL Retention: వచ్చే ఏడాది నుంచి ఐండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో రెండు కొత్త జట్లు ఆడనున్నాయి. ఇప్పటివరకూ 8 జట్లు ఉండగా.. ఐపీఎల్ సీజన్ 15లో అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు చేరుతున్నాయి. అయితే లక్నో ఫ్రాంచైజీ అప్పుడే రాజకీయాలు మొదలుపెట్టిందా.. ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారిని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్ ఖాన్‌ను, పంజాబ్ కింగ్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌లను కొత్త ఫ్రాంచైజీ లక్నో సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిన్న బీసీసీఐకి ఈ ఫ్రాంచైజీలు రీటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా చూస్తే వీరిని పాత ఫ్రాంచైజీలు తీసుకోలేదు. అంతకుముందే పంజాబ్, సన్ రైజర్స్ యాజమాన్యాలు ఈ విషయంపై బీసీసీఐకి రాతపుర్వకంగా ఫిర్యాదు చేయకపోయినా.. మౌఖికంగా ఫిర్యాదు చేశాయి. ఇందులో భాగంగా సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను, పంజాబ్ టీమ్ రాహుల్‌లను రీటెయిన్ చేసుకోలేదు. ఒకవేళ లక్నో ఫ్రాంచైజీ వీరిని ముందుగానే కలిసి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే మాత్రం చర్యలు తప్పవని బీసీసీఐ చెబుతోంది.


గతంలో రవీంద్ర జడేజా ఇలాంటి కారణంగానే ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. ఐపీఎల్ తొలి రెండు సీజన్లు 2008, 2009లో బ్యాట్, బంతితో రాణించిన జడేజాను మరో ఫ్రాంచైజీ నిబంధనలకు భిన్నంగా సంప్రదించడం దుమారం రేపింది. చివరికి అది నిజమని తేలడంతో 2010 సీజన్ ఆడకుండా బీసీసీఐ, ఐపీఎల్ వేటు వేసింది. తాజాగా లక్నో ఫ్రాంచైజీ రషీద్, రాహుల్ లను రీటెయిన్‌ జాబితాకు ముందు మంతనాలు జరిపింది. మరోవైపు ఇతర జట్లతో కాంట్రాక్టులో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని తేలడంతో ఏడాది ఐపీఎల్ ఆడకుండా వేటు వేశారు.  
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!


ఎందుకిలా జరిగిందంటే..
గత సీజన్లో కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌ 2021లో రాహుల్‌ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు. మరోవైపు రషీద్ ఖాన్ తక్కువ ఎకానమీతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తాడు. వికెట్ల తీయడంలోనూ ఈ అఫ్గాన్ స్పిన్నర్ దిట్ట. కొత్త ఫ్రాంచైజీ కావడంతో కనీసం ఇద్దరు ముగ్గురు కీలక ఆటగాళ్లను తీసుకోవాలని లక్నో మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు. అయితే ఇతర ఫ్రాంచైజీలు కాంట్రాక్టులో ఉన్న సమయంలో ఆటగాళ్లను సంప్రదించడం, ఆశచూపడం లాంటివి చేస్తే పాత ఫ్రాంచైజీలకు నష్టం జరుగుతుంది. ఆటగాళ్లు ఆశించిన దాని కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే పాత ఫ్రాంచైజీలు వారిని రిలీజ్ చేయక తప్పని పరిస్థితి. ప్రస్తుతం రాహుల్, రషీద్ విషయంలో ఇదే జరిగింది. భారీగా డిమాండ్ చేస్తున్నారని పంజాబ్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు వారిని రీటెయిన్ చేసుకోలేదని క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read: ఐపీఎల్ 2022 వేలంలో ఈ 10 ఇండియన్ ప్లేయర్లకు డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి