ఐపీఎల్ 2022లో ఈసారి పది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ జట్లు ఈసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ జట్లలో లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు ఎప్పట్నుంచో వస్తున్నాయి. ఇప్పుడు అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపిక అయినట్లు కథనాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కేఎల్ రాహుల్ గతంలోనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కూడా కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాబట్టి తనను కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ హార్దిక్‌కు కెప్టెన్సీ చాన్స్ రావడం మాత్రం ఆశ్చర్యకరమైన వార్తే. ఎందుకంటే అంతర్జాతీయ టీ20 జట్లకు కెప్టెన్సీ చేసి నిరూపించుకున్న వార్నర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్ వంటి వారు ఉన్నప్పటికీ తనకు కెప్టెన్సీ దక్కడం అద్భుతమే.
అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ కెప్టెన్‌గానూ, ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గానూ ఎంపికయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరితో పాటు రషీద్ ఖాన్‌ను కూడా జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు లక్నో, అహ్మదాబాద్ జట్లు మూడేసి ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు జట్లకు వెళ్లే ఆరుగురు ఆటగాళ్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా ఫిక్స్ అయితే మిగతా ఆటగాళ్లుగా ఎవరిని తీసుకుంటారు? అనే విషయం తెలియాల్సి ఉంది. బీభత్సమైన ఫాంలో ఉన్న డేవిడ్ వార్నర్ ఈసారి ఆర్సీబీ జెర్సీలో కనిపించనున్నాడని కూడా తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ మధ్య బాండ్ మరింత పెరిగింది. వార్నర్ పోస్టులకు కోహ్లీ కామెంట్లు పెట్టడం కూడా మనం చూడవచ్చు. మొత్తానికి టైం దగ్గర పడేకొద్దీ ఐపీఎల్ వేలం వార్ వేడెక్కనుందని చెప్పవచ్చు.