ఇండియన్ ప్రీమియర్ లీగు రెండో దశలో తొలి పోరుకు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కీలకం కావడంతో రోహిత్ సేన మైదానంలో కఠినంగా సాధన చేస్తోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటన నుంచి వచ్చిన కొందరు ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు మాత్రం క్వారంటైన్‌లో ఉన్నారు. మిగతా వాళ్లు మైదానంలో ఉంటే వీరు మాత్రం పక్కింట్లో, ఎదురింట్లో వారితో ముచ్చట్లు పెడుతున్నట్టు గడుపుతున్నారు.
Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ
ఈ నేపథ్యంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, సంజనా; సూర్యకుమార్ యాదవ్, దేవీషా శెట్టి దంపతులు ఒకే భవంతిలో పైన, కింది గదుల్లో బస చేస్తున్నారు. బాల్కనీలో నిలబడి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ చిత్రం ట్విటర్ సహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ చిత్రానికి ముంబయి ఇండియన్స్ తాజాగా ఓ సరదా వ్యాఖ్య పెట్టింది. ఆ దంపతులు ఏ మాట్లాడుతున్నారో అంచనా వేసింది. బహుశా సూర్యకుమార్ ' హే.. మీ దగ్గర నీళ్లు ఉన్నాయా?' అని అడిగాడేమోనని ఫన్నీ కాప్షన్ పెట్టింది. దాంతో ఈ పోస్టు మళ్లీ వైరల్‌గా మారింది.
చెన్నైతో మ్యాచ్ మొదలవుతుండటంతో ముంబయి శనివారం సాధన చేసింది. శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. చెన్నై మ్యాచ్ నేపథ్యంలో ఒకప్పుడు సీఎస్‌కేపై అతడి బౌలింగ్ ప్రదర్శనలను ముంబయి గుర్తు చేసుకుంది. సాధన చేస్తున్న మైదానంలోకి సచిన్ వచ్చి సూచనలు చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది.