దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. అందులో 'విక్రమార్కుడు' సినిమా ఒకటి. రవితేజ-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులను సృష్టించింది. ఇందులో విక్రమ్ రాథోడ్ గా, అత్తిలి సత్తిగా రెండు వేరియేషన్స్ లో పాత్రల్లో నటించి మెప్పించాడు రవితేజ. ముఖ్యంగా అతడి పోలీస్ గెటప్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీతో పాటు మిగిలిన భాషల్లో కూడా రీమేక్ చేశారు. 

 

ఈ సినిమా విడుదలై దాదాపు పదిహేనేళ్లు అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని అన్నారు. కానీ రాజమౌళి ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడంతో 'విక్రమార్కుడు' ఊసే లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను సిద్ధం చేశారట రచయిత విజయేంద్రప్రసాద్. అయితే ఈ కథను రాజమౌళి డైరెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే.. రాజమౌళి వరుస సినిమాలను కమిట్ అయ్యారు. 

 


 

ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న ఆయన.. తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. రెండు రోజులుగా ఆయన బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఉంది. అలా చూసుకుంటే మరో మూడేళ్ల వరకు రాజమౌళి చాలా బిజీ. అందుకే విజయేంద్రప్రసాద్ ఈ కథను మరో డైరెక్టర్ చేతిలో పెట్టాలనుకుంటున్నారట. 

 

ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. డైరెక్టర్ సెట్ అయితే రవితేజను సంప్రదించి డేట్స్ అడిగే అవకాశం ఉంది. పాన్ ఇండియా సబ్జెక్టుకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండడంతో పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి విజయేంద్రప్రసాద్ తో కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. మరి డైరెక్టర్ గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి!