దిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై తిరుగులేని విజయం అందుకుంది. ఈ సీజన్లో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. సంజు శాంసన్ సేనపై 70 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. మొదట రిషభ్ పంత్ (24; 24 బంతుల్లో 2x4), శ్రేయస్ అయ్యర్ (43; 32 బంతుల్లో 1x4, 2x6), హెట్‌మైయిర్ (28: 16 బంతుల్లో 5x4) మెరుగ్గా ఆడటంతో దిల్లీ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బదులుగా రాజస్థాన్ 121/6కే పరిమితమైంది. సంజు శాంసన్ (70; 53 బంతుల్లో 8x4, 1x6) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
Also Read: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?
బదుల్లేని రాజస్థాన్
ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. మోస్తరు లక్ష్యాన్ని త్వరగా ఛేదించాలనుకున్న సంజు సేనను దిల్లీ బౌలర్లు దెబ్బకొట్టారు. ఆరు పరుగుల వద్దే ఓపెనర్లు లియామ్ లివింగ్‌స్టన్ (1), యశస్వీ జైశ్వాల్ (5) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు వికెట్లు వరుసగా పడుతున్నా ఓపిక పట్టాడు. అయితే అతడికి మహిపాల్ లోమ్రర్ (19; 24 బంతుల్లో 1x4) ఒక్కడే అండగా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ (7), రియాన్ పరాగ్ (2), రాహుల్ తెవాతియా (9) రాణించలేదు. ఒకవైపు చేయాల్సిన స్కోరు పెరగడంతో రాజస్థాన్ చేతులెత్తేసింది.
Also Read: పంజాబ్‌తో రైజర్స్ పోటీ.. ఓడితే అస్సామే!
శుభారంభం దక్కకున్నా..
దిల్లీ ఇన్నింగ్స్ అనుకున్నంత వేగంగా సాగలేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. బంతి బ్యాటు మీదకు రాలేదు. పైగా రాజస్థాన్ బౌలర్లు తెలివిగా వేగం తగ్గించి బంతులేశారు. దాంతో జట్టు స్కోరు 18 వద్దే శిఖర్ ధావన్ (8) కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరికాసేపటికే పృథ్వీ షా (10) సకారియా బౌలింగ్‌లో వికెట్ల మీదకు ఆడుకున్నాడు.
Also Read: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే
ఒత్తిడిలో పడ్డ దిల్లీని కెప్టెన్ రిషభ్ పంత్‌తో కలిసి మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా శ్రేయస్ ఆడిన షాట్లు ఆకట్టుకున్నాయి. బంతి అనువుగా రాకున్నా అతడు కొన్ని కళ్లుచెదిరే బౌండరీలు బాదేశాడు. పంత్ సైతం దొరికిన ప్రతి బంతినీ బౌండరీకి తరలించాడు. వీరిద్దరూ తొమ్మిది పరుగుల వ్యవధిలో వెనుదిరగడంతో స్కోరు వేగం తగ్గింది. పంత్‌ను ముస్తాఫిజుర్ ఔట్ చేయగా, శ్రేయస్‌ను సంజు స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత లలిత్ యాదవ్ (14*; 16 బంతుల్లో 1x4) అండగా హెట్‌మైయిర్ (28: 16 బంతుల్లో 5x4) చెలరేగడంతో దిల్లీ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.