ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్‌కింగ్స్ అదరగొట్టింది. నాలుగో సారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పటి వరకు లీగులో తొమ్మిది ఫైనళ్లు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించింది. మరే జట్టుకీ ఈ ఘనత లేదు. గతేడాది పాయింట్ల పట్టికలో ఆఖర్లో నిలిచిన అదే జట్టు ఈసారి విజేతగా నిలిచేందుకు కారణాలేంటి? చెన్నై మాత్రమే ఇలాంటి అద్భుతాలను ఎందుకు చేస్తుంది?
నడిపించే నాయకుడు
చెన్నై సూపర్‌కింగ్స్ ప్రధాన బలం ఎంఎస్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించనిది ఏమీ లేదు! దాదాపుగా అన్ని ఘనతలూ అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అతడిని మించిన తెలివైన కెప్టెన్ మరొకరు లేరు. అతడిని మించిన క్రికెట్ మేధావి ఇంకొకరు లేరు. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో నోబెల్ బహుమతే ఉండుంటే.. మహీకి ఎన్నొచ్చేవో! మ్యాచుకు ముందు అతడు చేసినంత అధ్యయనం మరెవ్వరూ చేయలేరు. వాతావరణం, పిచ్ పరిస్థితి, ఆటగాళ్ల ఎంపిక, మ్యాచ్ ఏ దశలో ఎలా మలుపు తిరుగుతుంది, ఎవరితో ఎప్పుడు బౌలింగ్ చేయించాలి, ప్రత్యర్థి బలహీనతలు ఏంటి ఇలా అనేక కోణాల్లో అతడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తిరుగులేని ప్రదర్శనకు అతడే మూలస్తంభం.
ప్రాథమిక సూత్రాలు మరువరు
యుద్ధమైనా, ఆటైనా, సాఫ్ట్‌వేరైనా, శక్తికి మించిన కర్తవ్యమైనా.. అన్నిటికీ ప్రాథమిక సూత్రలే అవసరం. అందుకే సీఎస్‌కే అద్భుతాలను నమ్ముకోదు. కొత్త క్రికెటింగ్ షాట్లపైనే ఆధారపడదు. ట్వంటీఫస్ట్ సెంచరీ క్రికెట్‌ను పట్టించుకోదు. ఆట ప్రాథమిక ప్రక్రియనే నమ్ముకుంటుంది. అందుకే గతేడాది చెత్త ప్రదర్శన చేయగానే ఆటగాళ్లను తీసేయలేదు. మరికొందరిని అదనంగా చేర్చుకుంది. తమ ప్రాసెస్‌ను బలంగా నమ్మింది. మ్యాచు సాగుతోంటే ఎలాంటి ఇంటెన్సిటీ చూపించాలో అదే చూపిస్తుంది. మ్యాచులో గెలుపోటముల సహజం అనుకుంటుంది. ఒక మ్యాచు ఓడగానే దృక్పథం, లక్ష్యం మార్చుకోదు.
నమ్మకమే బలం
ఐపీఎల్‌లో సీఎస్‌కే మించి మరే జట్టు, ఫ్రాంచైజీ ఆటగాళ్లను నమ్మదు! 2008 నుంచీ ఇది ప్రూవ్ అయింది. వికెట్లు తీయకున్నా.. పరుగులు చేయకున్నా ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తుంది. మేం మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నామని గట్టిగా చెబుతుంది. దాంతో లీగ్ మొత్తం ఆడని క్రికెటర్ ప్లేఆఫ్స్, ఫైనళ్లలో దుమ్మురేపుతుంటారు. రెండేళ్ల క్రితం షేన్ వాట్సన్, ఈ సారి రాబిన్ ఉతప్ప అందుకు నిదర్శనం. ధోనీ, జట్టు యాజమాన్యం చూపే ఆ నమ్మకంతోనే అంతర్జాతీయ క్రికెట్లో విఫలైన క్రికెటర్లు చెన్నైకి రాగానే దంచికొడుతుంటారు. వికెట్లు తీస్తారు. తమ బేస్ టీమ్‌ను చెన్నై ఎప్పుడూ మార్చదు. అందుకే కోట్లు పెట్టి కొన్నా కృష్ణప్ప గౌతమ్‌కు ఎక్కువ అవకాశాలే ఇవ్వలేదు.
పెంచి పోషిస్తుంది
యువ క్రికెటర్లను గ్రూమ్ చేయడంలో చెన్నైకి తిరుగులేదు. దేశవాళీ క్రికెటర్ దీపక్ చాహర్‌ను ఎంతో జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు. శార్దూల్ ఠాకూర్‌ను మంచి వికెట్ టేకర్‌గా మార్చారు. జడేజా వంటి ఆటగాడిని అంతర్జాతీయ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దారు. సంప్రదాయ క్రికెట్ ఆడే రుతురాజ్ టీ20 ఓపెనర్‌గా చితక్కొట్టడమూ అలాంటిదే. సాధారణంగా అతడు పవర్‌ప్లేలో ఎక్కువ షాట్లు ఆడడు. కాస్త నిలదొక్కుకొని.. 20,30 పరుగులు చేశాక దంచేస్తాడు. ధోనీ ఆటగాళ్లను మెల్లగా ఒత్తిడికి అలవాటు పడేలా చేస్తాడు. పంజాబ్ మ్యాచులో కేఎల్ రాహుల్ ఊచకోత కోస్తున్నా.. శార్దూల్‌కు మళ్లీ మళ్లీ బౌలింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ఓడిపోయినా.. ఆటగాడికి ఒత్తిడి అలవాటు అవుతుంది. పోరాడే శక్తి వస్తుంది.
అంతా ఒకే కుటుంబం
చెన్నై సూపర్‌కింగ్స్ రాణించేందుకు మరో కారణం.. జట్టంతా కుటుంబంలా మారడం! ఆటగాళ్లే కాకుండా వారి సతీమణులు, పిల్లలు సైతం మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రాంచైజీ ఓనర్ల దార్శనికత, ధోనీ ప్రశాంతత, కోచింగ్ స్టాఫ్ చూపించే చొరవ వారిని ఏకం చేస్తున్నాయి. ధోనీ, బ్రావో ఎంత గొప్ప స్నేహితులో అందరికీ తెలిసిందే. మహీని రైనా సొంత అన్నలా చూస్తాడు. శార్దూల్, దీపక్ చాహర్, రుతురాజ్ వంటి యువకులు మెంటార్‌గా భావించి అన్ని సమస్యలు చెప్పుకుంటారు. అసలు మహీ గది తలుపులు రాత్రైనా, పగలైనా తెరిచే ఉంటాయి.
పక్కగా వ్యూహాల అమలు
వ్యూహాలు రచించడంలో ప్రణాళికలు అమలు చేయడంలో సీఎస్‌కే అద్భుతం. ధోనీయే ఇందుకు కారణం. మ్యాచుకు ముందే కోచింగ్ స్టాఫ్‌తో కలిసి అతడు వ్యూహాలు రచిస్తాడు. మిగతా జట్లూ ఈ పని చేసినా.. ధోనీ అంత పక్కాగా అమలు చేయలేరు. వికెట్ కీపర్‌గా ఉంటూ సమయానికి తగినట్టుగా మార్పులు చేస్తుంటాడు. ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను చిత్తు చేస్తుంటే అప్పటికప్పుడు కొత్తగా ఆలోచించి మార్పులు చేస్తాడు. ఇవీ సీఎస్‌కే విజయానికి కొన్ని కారణాలు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా