Naina Jaiswal Conferred Doctorate At 22: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ నైనా జైస్వాల్( Naina Jaiswal) డాక్టరేట్‌ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో  నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌.. నైనాకు పీహెచ్‌డీ డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్‌ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్‌ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్‌ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు నైనా జైస్వాల్‌ సాధించారు.  8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన నైనా.. 13 ఏళ్లకే డిగ్రీ, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్ దేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లు గెలుచుకుంది.


తల్లితో కలిసి  న్యాయ విద్య
నైనా జైస్వాల్‌ మరో ఘనత సాధించారు. తల్లితో కలిసి ఆమె ప్రథమ శ్రేణిలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధి బాగ్‌లింగంపల్లి బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ కళాశాల నుంచి నైనా జైస్వాల్‌, ఆమె మాతృమూర్తి భాగ్యలక్ష్మి(45) ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ పూర్తిచేసిన తన తల్లి ప్రోత్సాహంతో న్యాయవిద్య అభ్యసించినట్లు సోమవారం నైనా జైస్వాల్‌ తెలిపారు. 


మోటివేషనల్‌ స్పీకర్‌గానూ....
మహిళలు ఎమోషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా భావించవద్దని నైనా జైస్వాల్‌ అన్నారు. ఆడవారు అంటే ఆది శక్తి అన్నారు. ఆడవారిని అగ్నితో పోల్చకు ఆరిపోతుంది. పువ్వుతో పోల్చకు రాలి పోతుంది. మంచుతో పోల్చకు కరిగిపోతుంది. ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు అద్బుతంగా ఉండిపోతుంది’ లాంటి  స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. 


తమ్ముడూ తోపే
హైదరాబాద్‌కు చెందిన అగస్త్య జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. 16 ఏళ్ల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. దీంతో ఇండియాలో అతి చిన్న వయస్సులో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన తొలి కుర్రాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో అగస్త్య జైస్వాల్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మొదటి డివిజన్ మార్కులతో అతడు ఉత్తీర్ణత సాధించాడు. అగస్త్య జైస్వాల్‌కు ఇది తొలి రికార్డు కాదు. గతంలో కూడా అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2020లో 14 సంవత్సరాలకే డిగ్రీ పూర్తిచేశాడు. దీంతో ఇండియాలో అతి చిన్న వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన తొలి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాడు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో అగస్త్య జైస్వాల్ బీఏ డిగ్రీ పూర్తిచేశాడు. అంతకుముందు తెలంగాణలో 9 ఏళ్ల వయస్సులో SSC బోర్డు పరీక్షలు పాసైన తొలి కుర్రాడిగా నిలిచాడు. 16 ఏళ్లకే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి దేశంలోనే అతి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన తొలి కుర్రాడిగా నిలవడంపై అగస్త్య జైస్వాల్ స్పందించాడు. 'నా తల్లిదండ్రులే నాకు గురువులు. మా నాన్న అశ్విని కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి జైస్వాల్ సపోర్ట్, ట్రైనింగ్‌తో సవాళ్లను ఎదుర్కొంటూ, ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నా' అని తెలిపాడు.