Significance of International Olympic Day: విశ్వ క్రీడలకు సమయం సమీపిస్తోంది. అథ్లెట్ల ఒక్కసారైనా పాల్గొనాలని పరితపించే ఒలింపిక్స్‌(Olympics) మరికొద్ది రోజుల్లోనే ఆరంభం కానున్నాయి. ఇవాళ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం(International Olympic Day 2024). అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని స్థాపించిన జూన్ 23న.. ప్రతీ ఏటా  అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఒలింపిక్స్‌ కోసం ప్రపంచమంతా నాలుగేళ్ల పాటు కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తుంటుంది. 

 

ఇదీ చరిత్ర

1947లో స్టాక్‌హోమ్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 41వ సెషన్‌లో చెకోస్లోవేకియాకు చెందిన ఒలింపిక్‌ కమిటీ సభ్యుడు డాక్టర్ గ్రస్..... ప్రపంచ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ఓ నివేదికను సమర్పించారు. 1948 జనవరిలో సెయింట్ మోరిట్జ్‌లో జరిగిన 42వ ఒలింపిక్‌ కమిటీ సెషన్ సందర్భంగా ఈ నివేదికను ఆమోదించారు. 23 జూన్ 1894న పారిస్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని స్థాపించారు. కాబట్టి  జూన్ 17 నుంచి 24 మధ్య ఏదో తేదీని ఒలింపిక్‌ దినోత్సవంగా నిర్ణయించాలని ఒలింపిక్‌ కమిటీ ప్రతిపాదించింది. అలా మొదటి ఒలింపిక్ దినోత్సవం 1948 జూన్ 23న మొదటి ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతీ ఏటా అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1978 ఒలింపిక్‌ క్రీడల్లో సభ్య దేశాలన్నీ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సూచించింది. లింగం, వయస్సు లేదా అథ్లెటిక్ సామర్థ్యంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రీడలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి ఒలింపిక్ దినోత్సవం జరుపుకుంటారు . 

 

ఒలింపిక్‌ డే రన్‌

విశ్వ క్రీడల్లో ఒలింపిక్ డే రన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొదటిసారిగా 1987లో ఒలింపిక్‌ రన్‌ను ప్రారంభించారు. ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి, క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ఈ రన్‌ను నిర్వహిస్తారు. ఒలింపిక్ డే రన్‌ను చాలా సభ్య దేశాలు ఘనంగా నిర్వహిస్తాయి. రండి.. తెలుసుకోండి.. నేర్చుకోండి అనే నినాదంతో ఒలింపిక్స్‌ డే రన్‌ను నిర్వహిస్తారు. వయస్సు, లింగం, సామాజిక నేపథ్యం, క్రీడా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనాలనే సందేశాన్ని ఈ రన్‌ ద్వారా వ్యాప్తి చేస్తారు. మొదటి ఒలంపిక్ డే రన్ 10 కి.మీ దూరం వరకు జరిగింది, ఇందులో 45 మంది దేశాలు పాల్గొన్నాయి. 2021 ఒలింపిక్‌ థీమ్ ' ఆరోగ్యంగా ఉండండి, దృఢంగా ఉండండి, వ్యాయామంతో చురుకుగా ఉండండి. ఒలింపిక్‌ కమిటీని 1894లో ప్యారిస్‌లో పియరీ కూబెర్టిన్ స్థాపించారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం, ప్రచారం చేయడం, నియంత్రించడం విశ్వ క్రీడల ముఖ్య ఉద్దేశం. ఒలింపిక్స్‌ ప్రధాన కార్యాలయం - లాసాన్, స్విట్జర్లాండ్లో ఉంది.