Paris Olympian Archana Kamath on quitting table tennis: భారత టేబుల్‌ టెన్నిస్‌(Table tennis) స్టార్‌ అర్చన కామత్‌(Archana Kamath) సంచలన నిర్ణయంతో క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. టేబుల్‌ టెన్నీస్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు అర్చన కామత్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతో భారత క్రీడా రంగం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుని భవిష్యత్తుపై ఆశలు రేపిన కామత్‌... కేవలం 24 ఏళ్ల వయసులో కెరీర్‌ను ముగించడం విశేషం. ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనుంది. ఆమె విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకుందని...అందుకే ఈ నిర్ణయం తీసుకుందని కామత్‌ కోచ్‌ అన్షుల్‌ గార్గ్‌ తెలిపారు. అర్చన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం ఎవరి తరం కాదని... అందుకే ఆమెతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఆమె టేబుల్‌ టెన్నీస్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైందని అన్షుల్‌ వెల్లడించారు.


 

సంచలన ప్రకటన

పారిస్‌ ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ అర్చన కామత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ స్టార్‌ ప్లేయర్‌పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విస్మయానికి గురిచేసింది. ఒలింపిక్‌ పతకం దక్కకపోయినా విశ్వ క్రీడల్లో అర్చన మెరుగ్గా రాణించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు చరిత్ర సృష్టించింది, ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు రౌండ్ ఆఫ్ 16లోౌ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం అదే తొలిసారి. క్వార్టర్-ఫైనల్స్‌లో జర్మనీతో జరిగిన పోరులో భారత మహిళల జట్టు ఓడిపోయింది. జర్మనీపై భారత్‌ ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఆ మ్యాచ్‌ గెలిచింది కూడా అర్చన కామతే. ఈ మ్యాచ్‌లో భారత్ 1-3తో ఓడిపోయి పోటీ నుంచి నిష్క్రమించింది. అయితే ఒలింపిక్ గేమ్స్‌ చరిత్రలో క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుని భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. అయితే విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తామని కామత్‌ గట్టిగా విశ్వసించింది. కానీ అది నెరవేరకపోవడంతో విశ్వ క్రీడల అనంతరం కామత్ రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. 

 



కోచ్‌తో సంభాషణ తర్వాతే...

పారిస్ ఒలింపిక్స్‌ గేమ్స్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అర్చన కామత్‌.. భవిష్యత్తు ప్రణాళికపై కోచ్ అన్షుల్ గార్గ్‌తో చర్చలు జరిపింది. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తామా అని కోచ్‌ను అర్చన అడిగింది. దీనికి కోచ్‌ అన్షుల్‌ గార్గ్‌ నిజాయతీగా సమాధానం చెప్పాడు. ఇది చాలా కష్టమని తాను అర్చనకు చెప్పానని.. దాని కోసం కష్టపడాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పినట్లు అన్షుల్‌ వెల్లడించాడు. ఎందుకంటే అర్చన టేబుల్‌ టెన్నీస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో కూడా లేదని... కానీ గత రెండు నెలల్లో ఆమె ఆట చాలా మెరుగుపడిందని.. అయినా అది సరిపోదని ఆమెకు చెప్పినట్లు అన్షుల్ వెల్లడించాడు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అర్చన తన నిర్ణయాన్ని మార్చుకోదని.. అందుకే రిటైర్‌మెంట్‌ ప్రకటించిందని తెలిపాడు.