Bajrang Punia Suspended: ఒలింపిక్స్‌ సమీపిస్తున్న వేళ... భారత స్టార్‌ రెజ్లర్ బజరంగ్ పునియా(Bajrang Punia)పై నాడా సస్పెన్షన్‌ వేటు విధించడం ఆందోళన రేపుతోంది. ఒలింపిక్స్‌ మరో 32 రోజుల్లో ఆరంభం కానున్న వేళ... బజరంగ్‌పై సస్పెన్షన్‌ విధిస్తూ నాడా(National Anti-Doping Agency ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పుడు భజరంగ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై బజరంగ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా... నాడాకు మళ్లీ ఏమైనా లేఖ రాస్తాడా.. లేక భారత ఒలింపిక్స్ సంఘం ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.




 

ఇంతకీ ఏం జరిగిందంటే...

డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు బజరంగ్ పునియా మరోసారి నాడా(NADA) సస్పెన్షన్‌ వేటు వేసింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా... ఒలింపిక్‌ కాంస్య పతక విజేత అయిన బజరంగ్ పునియాపై మరోసారి తాత్కాలిక నిషేధం విధించింది.  ఈ ఏడాది మార్చి 10న సోనిపట్ వద్ద ట్రయల్స్ సమయంలో బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించాడని నాడా సస్పెన్షన్‌ వేటు విధించిన కారణాలను వివరించారు. డోపింగ్‌ నియమాలను ఉల్లంఘించినందుకు పునియాపై సస్పెన్షన్‌ వేటు విధించినట్లు తెలిపింది.

బజరంగ్‌ పునియాను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు తమకు నోటీసు వచ్చిందని బజరంగ్ తరపు న్యాయవాది విషుస్పత్ సింగానియా తెలిపారు. తాము నోటీసు అందుకున్నామని... దానిపై కచ్చితంగా సమాధానం ఇస్తామని... గతసారి కూడా తాము విచారణకు హాజరయ్యామని సింగానియా గుర్తు చేశారు. ఈసారి కూడా విచారణకు హాజరై తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. బజరంగ్‌ ఏ  తప్పు చేయలేదని కాబట్టి తాము పోరాడుతామని బజరంగ్ తరపు న్యాయవాది చెప్పారు. నాడా జారీ చేసిన నోటీసుపై స్పందించేందుకు బజరంగ్‌కు జూలై 11 వరకు గడువు ఉంది.  యాంటీ-డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ 23వతేదీ నుంచి బజరంగ్‌పై సస్పెన్షన్‌ విధించాలని నిర్ణయించిందని తెలిపారు. 11వ తేదీ వరకూ ఈ నిషేధంపై సమాధానం చెప్పేందుకు అవకాశం బజరంగ్‌కు ఇచ్చామని నాడా తెలిపింది. 

 

శాంపిల్స్ ఇవ్వకుండా నాడాకు పలు ప్రశ్నలు

నమూనాలు సేకరించేందుకు నాడా వాడుతున్న పరికరాలపై గతంలోనే బజరంగ్‌ పునియా తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పరికరాలతో నమూనాలు ఇవ్వడానికి నిరాకరించాడు. నమూనాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూనే నాడాకు పలు ప్రశ్నలు సంధించాడు. ఈ ప్రశ్నలకు నాడా సమాధానం ఇవ్వనందుకే బజరంగ్‌ మరోసారి నమూనాలు ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇప్పుడు బజరంగ్‌పై నాడా సస్పెన్షన్‌ వేటు విధించడం ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పునియా అందులో పాల్గొంటాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. బజరంగ్ ఈసారి పతకం సాధిస్తాడన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బజరంగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ బజరంగ్‌ పునియా ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే నాటికి ఈ సస్పెన్షన్‌ను ఎత్తేస్తారా లేదా కొనసాగిస్తారా చూడాలి. ఒలింపిక్స్‌ ప్రారంభమ్యయేందుకు ఇంకా 32 రోజుల సమయం మాత్రమే ఉంది.