Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నాయి. ఏడాదికి పైగా జరిగిన యుద్ధంలో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడిని ముమ్మరం చేసింది.  ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ పై బాంబులతో విరుచుకుపడింది.  శనివారం జరిగిన నాలుగు బాంబు దాడులలో ఒకటి ఐదు అంతస్తుల నివాస భవనాన్ని ఢీకొట్టిందని రష్యా అధికారులు తెలిపారు. బాంబు దాడిలో ముగ్గురు మరణించారు. దాదాపు 41 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో గాయపడిన 41 మందికి చికిత్స కొనసాగుతోందని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సినిహుబోవ్ తెలిపారు. ఈ దాడుల జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే  ఉక్రెయిన్ ప్రతిదాడులకు దిగింది.


ఆదివారం ఒకేసారి 30 డ్రోన్లతో మాస్కోపై ఉక్రెయిన్ ఎదురు దాడి చేసింది.  రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోని గ్రావోరాన్ నగరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే అప్రమత్తమైన రష్యా సైన్యం వాటిని కూల్చివేసినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.  దీంతో రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్‌, స్మోలెన్స్క్, లిప్టెస్స్క్‌ ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగించేందుకు ఉక్రెయిన్‌ డ్రోన్‌లను ప్రయోగించింది. ఉక్రెయిన్ కుట్రను పసిగట్టిన రష్యా ఆర్మీ వాటిని కూల్చివేసింది.


అత్యాధునిక ఆయుధాలు ఇవ్వండి
ఈ వరుస దాడులతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిన్‌ జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దాడి తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఉక్రెయిన్  వైమానిక రక్షణను బలోపేతం చేయాలని మిత్రదేశాలను కోరారు.  ఆయన మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌కు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా అవసరం. అంతకుముందు, కీవ్ ప్రాంతంలో రాత్రంతా రష్యా క్షిపణి దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అనేక నివాస, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. అమెరికా అందజేస్తున్న ఎఫ్‌-16 విమానాలు నడిపేందుకు ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు.  రష్యాను ఎదుర్కొనేందుకు సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే ఆయుధాలను వినియోగించాల్సిన అవసరముంది. ఆ దిశగా భాగస్వామ్య దేశాలు తమకు సాయం చేయాలి’ అని ఆయన చెప్పుకొచ్చారు.  కీవ్ ప్రాంతంలో రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులలో రెండింటిని ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని  వైమానిక దళం కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ ఆదివారం తెలిపారు. 


కీవ్ లో అనేక భవనాలు ధ్వంసం 
ఇద్దరు వ్యక్తులు భవనాల శిధిలాలు పడిపోవడం వల్ల గాయపడ్డారని, ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కీవ్ రీజియన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ రుస్లాన్ క్రావ్‌చెంకో తెలిపారు. అలాగే ఈఆ దాడిలో ఆరు బహుళ అంతస్తుల నివాస భవనాలు, 20కి పైగా ప్రైవేట్ ఇళ్లు దెబ్బతిన్నాయి. అదనంగా, ఈ ప్రాంతంలో ఒక గ్యాస్ స్టేషన్, ఒక ఫార్మసీ, ఒక పరిపాలనా భవనం , మూడు కార్లు కూడా దెబ్బతిన్నాయి. కీవ్ దాని పరిసర ప్రాంతాలు.. ఉక్రెయిన్ అంతటా అనేక ఇతర ప్రాంతాలలో ఆదివారం ఉదయం సుమారు గంటపాటు వైమానిక దాడుల హెచ్చరికలను జారీ చేశారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాదాపు 10,000 గైడెడ్ బాంబులను పడవేసిందని ఆ దేశ రక్షణ మంత్రి రుస్తమ్ ఉమరోవ్ మే నెలలో తెలిపారు.