Former US President Donald About Automatic Green Cards | అమెరికాలో చదువుతోన్న విదేశీ విద్యార్థులందరికీ ఆయా కాలేజీల నుంచి వారి గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే అమెరికా పౌరసత్వం ఇచ్చేయాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడే అవకాశమున్న ట్రంప్ ఇటీవల ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేవారు. 


‘‘హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఇండియా, చైనా వంటి దేశాలకు చెందిన  విద్యార్థులు వారి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఇక్కడే ఉండి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఎలాగైనా అమెరికాలో ఉండాలని వారంతా విశ్వ ప్రయత్నం చేస్తారు. అలా కుదరని పక్షంలో ఇక్కడుండే అవకాశం లేక.. వెంటనే ఉద్యోగాలు రాక,  తిరిగి వారి వారి దేశాలకు వెళ్లిపోయి, అక్కడ కంపెనీలు పెట్టి, కోట్లకి పడగలెత్తి అక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఇక్కడి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకుని అత్యుత్తమ  నైపుణ్యాలు పొందిన వారి స్కిల్స్  ఇక్కడే ఉపయోగించాలి. ఇక్కడే శాశ్వతంగా నివసించే అవకాశం వారికి ఇస్తే..  అత్యుత్తమమైన వారి నైపుణ్యాలతో ఇక్కడ కొత్త కంపెనీలు వస్తాయి. అాలాగే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఇక్కడి ఇనిస్టిట్యూట్లలో గ్రాడ్యుయేషన్ అవ్వగానే వారికి ఆటోమేటిక్  గ్రీన్ కార్డులిచ్చేయాలి. రెండేళ్లు, నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్‌ కళాశాలలకూ దీన్ని వర్తింపజేయాలి. అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తా’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. 


అసలేంటీ ఆటోమేటిక్ గ్రీన్ కార్డు.. 


గ్రీన్ కార్డ్ అంటే విదేశాల నుంచి వచ్చిన వారికి అమెరికా శాశ్వత పౌరసత్వం ఇస్తూ ఇచ్చే ఓ ఐడెంటిటీ. ఇది ఉంటే ఎన్నేళ్లయినా అమెరికాలోనే ఉండొచ్చు. ఇది కల్గిన వాళ్ల పిల్లలకి కూడా అమెరికా పౌరసత్వం వస్తుంది. ప్రస్తుతం ట్రంప్ అమెరికాలో చదివి గ్యాడ్యుయేట్లయిన వారికి ఆటోమేటిక్ గ్రీన్ కార్డు ఇస్తానంటున్నారు. అంటే అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఆ డిప్లమాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.  


అన్నంత పనీ చేస్తారా? 


ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా వెళ్లి చదవాలనుకున్న భారత్, చైనా వంటి దేశాల విద్యార్థులంతా ఇప్పుడు ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ నిజంగా అన్నంత పనీ చేస్తారా.. లేక ఇది పొలిటికల్ స్టంటా అని చర్చించుకుంటున్నారు. 2016లోనూ ట్రంప్ ఇవే మాటలు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారికి చుక్కలు చూపించారు. 7 ముస్లిం దేశాల నుంచి పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించారు.  లీగల్ ఇమిగ్రేషన్ ను సగానికే పరిమితం చేశారు. హెచ్ 1 బీ వీసాను తీవ్రంగా వ్యతిరేకించారు. 


ప్రస్తుత అధ్యక్షుడి బాటలో.. 


 అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ అధికారంలోకి వచ్చాక అమెరికా పౌరసత్వం కల్గిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు సైతం ఆటోమేటిక్ గ్రీన్ కార్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు. అంటే అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు పొందిన విదేశీ ఉద్యోగికి పెళ్లయితే.. వారి భార్య, లేదా భర్తకు సైతం గ్రీన్ కార్డు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నమాట. ప్రస్తుతం ట్రంప్ సైతం ఈ ఆటోమేటిక్ గ్రీన్ కార్డు వాదనతో ముందుకు రావడం.. అమెరికాలో దాదాపు పది శాతం ఉన్న ఫారెన్ పౌరుల ఓట్లకోసమేననే ప్రచారమూ జరుగుతోంది.


అందరికీ వస్తాయా? 


అయితే ట్రంప్ వ్యాఖ్యలు అత్యద్భుతమైన నైపుణ్యాలు కల్గిన విదేశీ విద్యార్థులకు మాత్రమే పరిమితమని ట్రంప్ క్యాంపెయిన్ నేషనల్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్టులకు, అమెరికాను వ్యతిరేకించేవారికి, తీవ్రవాదులకు ఈ వ్యాఖ్యలు వర్తించవు. వారి నైపుణ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వారికి గ్రీన్ కార్డు ఇవ్వొచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు’’ అని తెలిపారు.