Indian Football Legend Sunil Chhetri Announced His Retirement: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్(Foot Ball)కు ఉన్న క్రేజే వేరు. రొనాల్డో, మెస్సీ, ఎంబాపే వంటి దిగ్గజ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు లోకమంతా ఊగిపోతుంది. ఆర్జనలో, అభిమానంలో ఆటగాళ్ల స్థాయి ఆకాశమంత ఎత్తున ఉంటుంది. భారత్‌లో మాత్రం ఫుట్‌బాల్‌కు అంత ఆదరణ లేదు. అయినా మనకూ ఒక మెస్సీ ఉన్నాడు. తన ఆటతీరుతో భారత్‌లో ఫుట్‌బాల్ ఉనికిని కాపాడుతూ వస్తున్నాడు. తన ప్రతిభతో భారత ఫుట్‌బాల్‌కు చిరునామాగా మారిన సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గురువారం వీడ్కోలు ప్రకటించాడు. జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫైయింగ్(FIFA World Cup qualifier) మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దేశం కోసం తాను ఆడినందుకు గర్వపడుతున్నానంటూ.. ఉద్వేగ పూరిత ప్రసంగం చేశాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా తనను ప్రోత్సహించిన, అండగా నిలిచిన వారికి, అభిమానులకు కృతజ్ఙతలు తెలిపాడు.
అతని ఘనత అంతా ఇంతా కాదు ..
18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఏ భారత ఆటగాడికీ సాధ్యం కాని ఘనతలు, రికార్డులతో చరిత్ర లిఖించిన ఆ ఆటగాడే సునీల్ ఛెత్రీ. మైదానంలో ఫార్వర్డ్‌గా, భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛెత్రీ ఎన్నో మైలురాళ్లు దాటాడు. 40 ఏళ్ల వయసులోనూ అమితోత్సాహంతో భారత జట్టును నడిపించాడు. అప్పట్లోనే "భారత ఫుట్‌బాల్ అభిమానులారా.. మీరంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మైదానంలో ఫ్యాన్స్ అండగా ఉంటే విజయానికి కావలసిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఆటకు మద్దతు పలికితేనే భారత్‌లో ఫుట్‌బాల్ స్థాయి పెరుగుతుంది "అని పిలుపునిచ్చి భారత్‌లో ఫుట్‌బాల్ ఆదరణ కోసం గళమెత్తాడు ఛెత్రి. మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఛెత్రీకి 150వ మ్యాచ్. అయితే గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓటమి పాలైంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఛెత్రీ 94 గోల్స్ సాధించి ఇండియా ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా రికార్డులకెక్కాడు.
క్లబ్‌ల తరఫున ఆడి ..
18 ఏళ్ల వయసులో ఛెత్రీ తొలిసారి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లోకి అడుగు పెట్టాడు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ క్లబ్ ఛెత్రీకి తొలి అవకాశం కల్పించింది. సీజన్‌లో ఆరు గోల్స్‌తో అతను సత్తా చాటాడు. మోహన్‌బగాన్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, చిరాగ్ యునైటెడ్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు.. ఇలా భారత ఫుట్‌బాల్‌లో ప్రత్యేక విలువ ఉన్న, ప్రతిష్ఠాత్మక క్లబ్‌లు అన్నింటికీ ఛెత్రీ ప్రాతినిధ్యం వహించాడు. అమెరికాకు చెందిన కాన్సస్ సిటీ విజార్డ్స్ క్లబ్, పోర్చుగీస్‌కు చెందిన స్పోర్టింగ్ సీపీ క్లబ్ తరఫునా అతను ఆడాడు. ఎన్‌ఎఫ్‌ఎల్‌తో మొదలు పెట్టి ఐ లీగ్, మేజర్ లీగ్ సాకర్, లిగా ప్రొ, ఇండియన్ సూపర్ లీగ్‌లలో ఆడిన ఛెత్రీ ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛెత్రీ ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు.
చివరి మ్యాచ్ --
భారత్ – కువైట్ మధ్య జూన్ 6న ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్ గ్రూప్-ఎలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలోఉన్న ఖతార్ కంటే వెనుకబడి ఉంది.