Southwest Monsoon Rains : మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నలకు వాతావరణశాఖ శుభవార్త అందజేసింది. ఈ ఏడాది జూన్‌ కన్నా ముందుగానే  నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. మే 31నే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) రానున్నట్లు I.M.D. వెల్లడించింది..


వాన కబురు
మండుతున్న ఎండాకాలం ప్రజలందరికీ వాతావరణశాఖ(Meteorology Department)  చల్లటి కబురు పంపింది. ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళ(Kerala)ను తాకే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోయారు. వర్షాలు లేక జలాశయాలన్నీ ఖాళీ అయ్యాయి. రుతుపవనాలు రాకతో విస్తరంగా వర్షాలు కురవనున్నాయి. సరైన సమయంలో రుతుపవనాలు పలకరిస్తే....సకాలంలో పంటలు వేయడం వల్ల ఆ తర్వాత వచ్చే తుపాన్‌లు, వరదల నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంది. వాతావరణశాఖ తెలిపిన చల్లని కబురుతో రైతుల ముఖంలో వెలుగులు నిండాయి. ఇప్పటికే పంటపొలాలను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మనదేశంలో నైరుతి రుతుపవనాల వల్లే విస్తరంగా వర్షాలు కురుస్తాయి. వర్షాధార పంటలకూ ఇవే ఆధారం. దేశంలో జూన్‌, జులై నెలలో పడే వర్షాలే అత్యంత కీలకం. 


సాధారణంగా నైరుతి రుతుపవనాలు కొంచెం అటు, ఇటుగా జూన్(June) తొలివారంలోనే దేశంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది జూన్‌ 8న రాగా...ఈసారి వారం రోజులు ముందుగానే పలకరించనున్నాయి. ఒకసారి కేరళ(Kerala)లోకి ప్రవేశించిన తర్వాత వారం పదిరోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh) భూభాగంపైకి విస్తరించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 


గతేడాది నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతోపాటు..దేశంలోనూ వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా విస్తరించడంతో తొలకరి జల్లుల కోసం రైతులు కళ్లు కాయలు కాసే వరకు ఎదురు చూశారు. పైగా నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా తొలినాళ్లలో పెద్దగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చిరుజల్లులు కురిపించడంతో ఆశగా పంటలు వేసి ఆకాశం వైపు ఎదురుచూడటమే పనైపోయింది. వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. రైతులు ఆ పంటలను దున్ని మళ్లీ నాటుకోవాల్సి వచ్చింది. వర్షాధార పంటలపైనే ఆధారపడే తెలుగు రాష్ట్రాల ప్రజలకు నైరుతి రుతుపవనాల రాక ఎంతో కీలకం. అనుకున్న సమయం కన్నా ఆలస్యం కావడం వల్ల తొలినాళ్లలో వర్షాలు లేక ఇబ్బందిపడిన రైతులు... ఆ తర్వాత పంటలు చేతికొచ్చే సమయంలో కుంభవృష్టితో మరోసారి నష్టపోయారు.ఈసారి సకాలంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ కబురుతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అదునులోనే పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది మిగిల్చిన పంట  నష్టాలను సైతం ఈసారి పూడ్చుకోవాలని వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.