వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా 2-0తో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 235 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. సిరీస్‌లో మూడో వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 11వ తేదీ) జరగనుంది.
ఆదుకున్న సూర్యకుమార్, కేఎల్ రాహుల్
టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెప్టెన్ రోహిత్ శర్మతో (5: 8 బంతుల్లో) పాటు రిషబ్ పంత్ (18: 34 బంతుల్లో, మూడు ఫోర్లు) ఓపెనింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్‌ను అవుట్ చేసి కీమర్ రోచ్ భారత్‌కు మొదటి షాక్ ఇచ్చాడు. అనంతరం రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలను (18: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) ఇన్నింగ్స్ 12వ ఓవర్లలో అవుట్ చేసి ఒడియన్ స్మిత్ భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. దీంతో భారత్ 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కేఎల్ రాహుల్ (49: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. దీంతో వాషింగ్టన్ సుందర్‌తో (24: 41 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
వీరిద్దరూ అవుటయ్యాక చివర్లో దీపక్ హుడా (29: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడాడు. టెయిలెండర్లలో ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఇన్నింగ్స్ ఆఖర్లో చాహల్ (11 నాటౌట్: 10 బంతుల్లో, ఒక ఫోర్) విలువైన పరుగులు జోడించాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్‌లు రెండేసి వికెట్లు తీయగా.. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకేల్ హొస్సేన్, ఫాబియన్ అలెన్‌లకు తలో వికెట్ దక్కింది. వెస్టిండీస్ తరఫున బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ వికెట్ తీయగలిగారు.
పడగొట్టిన బౌలర్లు
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ బాగానే ప్రారంభం అయింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ మొదటి వికెట్‌కు 7.3 ఓవర్లలో 32 పరుగులు జోడించారు. భారత యువ పేసర్ ప్రసీద్ కృష్ణ తన మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లతో చెలరేగాడు. వేగంగా ఆడుతున్న ఓపెనర్ బ్రాండన్ కింగ్‌తో పాటు.. వన్ డౌన్ బ్యాటర్ డారెన్ బ్రేవోను కూడా ప్రసీద్ అవుట్ చేయడంతో వెస్టిండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ కాస్త నిదానించింది. ఏడు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో షాయ్ హోప్, జేసన్ హోల్డర్, షర్మత్ బ్రూక్స్ కూడా అవుట్ అవ్వడంతో వెస్టిండీస్ 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉండటంతో 159 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.
అప్పుడు ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్ టీమిండియాను కాసేపు టెన్షన్ పెట్టారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి ఒడియన్ అవుటయ్యాడు. ఆ తర్వాత కీమర్ రోచ్‌ను ప్రసీద్ అవుట్ చేయడంతో వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ నాలుగు వికెట్లు తీశాడు. శార్దూల్ రెండు వికెట్లు దక్కించుకోగా.. సిరాజ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలు కూడా తలో వికెట్ తీశారు. వెస్టిండీస్ తరహాలోనే భారత్‌లో కూడా బౌలింగ్ చేసిన అందరికీ వికెట్ దక్కింది.