టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. స్వదేశంలో వంద వన్డేలు ఆడిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచులోనైనా అతడు సెంచరీ చేయకపోవడం బాధాకరం!
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్, టీమ్‌ఇండియా తలపడ్డ రెండో వన్డే కోహ్లీకి స్వదేశంలో వందో మ్యాచ్. తన కెరీర్లోనే ప్రత్యేకమైన ఈ పోరులో అతడు 30 బంతుల్లో 3 బౌండరీలు బాది 18 పరుగులే చేశాడు. ఒడీన్ స్మిత్ పన్నిన ఉచ్చులో చిక్కుకొని వికెట్ కీపర్ షైహోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆఫ్‌సైడ్ కాస్త బౌన్స్ అయిన బంతి అతడి బ్యాటు అంచుకు తగిలి కీపర్ చేతుల్లో పడింది. నిజానికి విరాట్ సగటు వన్డేల్లో చాలా బాగుంది. అయినప్పటికీ అతడు సెంచరీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 36 మంది క్రికెటర్లు తమ స్వదేశాల్లో వంద వన్డేల మైలురాయిని అధిగమించారు. భారత్‌లోనైతే కోహ్లీతో కలిసి ఐదుగురు ఈ ఘనత అందుకున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ సొంతగడ్డపై 164 వన్డేలు ఆడి 20 సెంచరీల సాయంతో 6,976 పరుగులు చేశాడు. ఇక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 127 వన్డేలు ఆడి 4,351 పరుగులు చేశాడు. ఏడు శతకాలూ ఉన్నాయి. హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ 113 వన్డేల్లో 3 శతకాలతో 3,163 పరుగులు సాధించాడు. ఇక ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ 108 మ్యాచుల్లో 7 సెంచరీలు దంచాడు. 3,415 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 100 వన్డేల్లో 19 సెంచరీలు, 25 అర్ధశతకాలతో 5,020 పరుగులు చేశాడు. మొత్తంగా అతడి సగటు 59.05గా ఉంది.
విరాట్ మరో ఘనతకూ చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్ అతడి కెరీర్లో వందో టెస్టు. మొదట దీనిని బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో నిర్వహిస్తారని అనుకున్నారు. అయితే షెడ్యూలు మారడంతో వేదిక పంజాబ్ క్రికెట్ సంఘం మైదానం మొహాలికి మారింది. అందులోనైనా కింగ్ కోహ్లీ శతకం చేస్తే బాగుంటుంది.
Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?
Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్ కమిటీ ప్రకటన