వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముంగిట భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లకు కరోనావైరస్ సోకింది. మూడు వన్డేల సిరీస్ ఆడటానికి అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు భారత క్రికెటర్లందరికీ కరోనా పరీక్షలు చేశారు. వీరు ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరి స్థానంలో ఆడేవారిని త్వరలో ప్రకటించనున్నారు. భారత్, వెస్టిండీస్ సిరీస్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


ఈ పర్యటనలో వెస్టిండీస్‌తో భారత్ మొదట మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో తలపడనుంది. వన్డే మ్యాచ్‌లకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరా వేదిక కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ, 9వ తేదీ, 11వ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ, 18వ తేదీ, 20వ తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీ20లు జరగనున్నాయి.


విండీస్‌లో మొత్తం 11 మంది ఆటగాళ్లు వన్డేలు, టీ20ల్లో రెండిట్లోనూ చోటు సంపాదించారు. ఇందులో కీరన్‌ పొలార్డ్‌, ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, జేసన్ హోల్డర్‌, షై హోప్‌, అకియెల్‌ హుస్సేన్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, రొమారియో షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, హెడెన్‌ వాల్స్‌ జూనియర్‌ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫిట్‌నెస్‌ ఇబ్బందుల వల్ల షిమ్రన్‌ హెట్‌మైయిర్‌కు మరోసారి మొండి చేయి లభించింది. ఫిట్‌నెస్‌ విషయంలో అతను చూపిస్తున్న అశ్రద్ధపై ఆ జట్టు కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ అసంతృప్తిగా ఉన్నారు.


'బార్బడోస్‌లో నిర్వహించిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టు అదరగొట్టింది. కాబట్టి అదే ఆటగాళ్లను ఎంపిక చేశాం. వారు మైదానంలో ఎంతో గొప్పగా పోరాడారు. అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించారు. భారత్‌లోనూ వారిలాగే పోరాడాలని కోరుకుంటున్నాం' అని విండీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ డెస్మండ్‌ హెయిన్స్‌ తెలిపారు.