సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనడం లేదట. ఫిబ్రవరి రెండో వారంలో మహేష్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్మేశారట.
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు 'సర్కారు వారి పాట' డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయట. అగ్రిమెంట్ ప్రకారం.. సినిమా థియేటర్లో విడుదలైన నెల రోజుల తరువాత ఓటీటీలోకి వస్తుందట. మే 12న రిలీజ్ కాబట్టి.. జూన్ నెలలో సినిమా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు.