సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుడిగా, టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu). సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ... ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిసున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇందులో నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది (DJ Tillu On February 11th). ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
"నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంఛ్ అవుతున్నాను నేను" అని హీరోయిన్ నేహా శెట్టితో హీరో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. అమ్మాయి దగ్గర బిల్డప్ కొట్టడం కోసం "బర్త్ డే పార్టీలో కలిశాడు. మనం డీజే టిల్లు అని యూట్యూబ్ కోసం ఒక పాట కొట్టాం. చూశావా? అది చార్ట్ బస్టర్. అది (బన్నీ) విన్నాడు. బట్టలు చింపేసుకున్నాడు. 'అరే టిల్లూ.... గిసువంటి పాటనే కావాల్రా బై' అన్నాడు" అని హీరో చెబుతాడు.
ట్రైలర్ చూస్తే... హీరో హీరోయిన్లు ప్రేమలో పడిన మాంచి రొమాంటిక్ ట్రాక్ కూడా పెట్టినట్టు ఉన్నారు. కారులో 'మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంటి?' అని అడగటం, హీరోకు హీరోయిన్ నడుము చూపించడం, హీరోతో కాకుండా ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనుతో కూడా హీరోయిన్ రొమాంటిక్‌గా ఉన్నట్టు చూపించడం సినిమాపై ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అందరినీ హీరోయిన్ వలలో వేసుకుని మోసం చేస్తుందా? అనే ఆసక్తి కలిగించింది.
కాసర్ల శ్యామ్ రాసిన 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. రామ్ మిరియాల (chowrasta ram) పాడిన ఆ గీతానికి మంచి స్పందన లభించింది. అలాగే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించిన 'రాజా రాజా... ఐటమ్ రాజా... రోజా రోజా... క్రేజీ రోజా...' పాటకూ మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించారు. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటించిన ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకులు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ జొన్నలగడ్డ కథ రాశారు.