చింతామణి పుస్తకాన్ని నిషేధించకుండా కేవలం నాటకాన్ని మాత్రమే ఎలా నిషేధిచారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి నాటకం నిషేధంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుతో పాటు ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత‌్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ఇతర అధికారులు అందరూ వచ్చే మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
Also Read: చింతామణి నాటకాన్ని ఎడిటింగ్ చేసైనా ఆడించాలంటున్న కళాకారులు
దాదాపుగా వందేళ్ల నాటి రచన అయిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర తమ వర్గాన్ని కించపరుస్తోందని ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చింతామణి నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే బదులు వ్యసనాల వైపు మళ్లిస్తుందని, ఈ నాటకాన్ని వెంటనే నిషేధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్ గత కొంత కాలం నుంచి ఆర్యవైశ్య సంఘాలు చేస్తూ వస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని, నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది. దీనిపై కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసభ్యంగా ఏమైనా సన్నివేశాలుంటే తొలగించాలి కానీ నాటకాన్ని నిషేధించతడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో మళ్లీ నాటకానికి అనుమతి లభిస్తుందని .. కళాకారులు ఆశిస్తున్నారు.