ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఎప్పుడొస్తుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా మార్చి 11న సినిమాను విడుదల చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. అయితే ఈ డేట్ అనౌన్స్ చేసి మేకర్స్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆ తేదీన రావడం వలన 'రాధేశ్యామ్' సినిమా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. 

 

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమాకి రెండు రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి 25న సినిమా రిలీజై సక్సెస్ అందుకుంటే 'రాధేశ్యామ్'కి కష్టమే. ఇక 'ఆర్ఆర్ఆర్' రూపంలో కూడా 'రాధేశ్యామ్'కి పోటీ ఎదురవుతోంది. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే 'ఆర్ఆర్ఆర్' థియేటర్లోకి వస్తుంది. 'రాధేశ్యామ్'కి హిట్ టాక్ వచ్చినా.. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ సమయానికి భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోవడం ఖాయం. 

 

తెలుగులో కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోలీవుడ్ లో ఫిబ్రవరి 24న అజిత్ 'వాలిమై' సినిమా వస్తుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మార్చి 11నాటికి థియేటర్లను ఖాళీ చేసి ఇవ్వడానికి అజిత్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. అలానే సూర్య నటించిన సినిమా కూడా 'రాధేశ్యామ్' విడుదలకు ఒక్క రోజు ముందు థియేటర్లో విడుదల కానుంది. ఆ విధంగా కూడా పోటీ ఉంటుంది. 

 

కన్నడలో పునీత్ నటించిన ఆఖరి సినిమా 'జేమ్స్' మార్చి 17న విడుదల కానుంది. అంటే అక్కడ.. 'రాధేశ్యామ్' రన్ ఆరు రోజులే ఉంటుందనుకోవాలి. పునీత్ పట్ల కన్నడ ఫ్యాన్స్ కు ఉన్న ఎమోషన్ కచ్చితంగా 'రాధేశ్యామ్'పై ఎఫెక్ట్ చూపిస్తుంది. నార్త్ లో 'రాధేశ్యామ్' సినిమాకి పోటీగా అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' విడుదల కాబోతుంది. కాబట్టి అక్కడ కూడా 'రాధేశ్యామ్' థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే.. 'రాధేశ్యామ్'కి అన్ని ఇండస్ట్రీల నుంచి పోటీ తప్పేలా లేదు!