యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. 1980 నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 


ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. అదేంటంటే.. 'పెద్ది'. సినిమా లాంఛింగ్ సమయంలోనే ఈ టైటిల్ ను ప్రకటించాలని భావిస్తున్నారట. టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో ఎన్టీఆర్ కి కూడా నచ్చిందని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. 


సుకుమార్ తన సినిమాల్లో హీరోలకు ఏదొక లోపం పెడుతుంటారు. ఆ లోపం సినిమాకి ప్లస్ అవుతుండడం విశేషం. 'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాల్లో స్టార్ హీరోలను లోపం ఉన్న క్యారెక్టర్లలో చూపించి హిట్ కొట్టారు సుకుమార్. ఇప్పుడు ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమాలో కూడా ఇలాంటి ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారట సుకుమార్. దీంతో బుచ్చిబాబు దానికి తగ్గట్లే స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ యాడింగ్ హీరో క్యారెక్టర్ వెయిటేజ్ ను మరింత పెంచుతుందని అంటున్నారు. 


అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉంది. ముందుగా ఎన్టీఆర్.. కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో మొదలవుతుందని సమాచారం. దీని తరువాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. మరి బుచ్చిబాబు సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.. !


ఇక ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు  ఎదురుచూస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.