విరాట్ కోహ్లీ గాయంతో దూరం కావడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో మహ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్‌ల సరసన కేఎల్ రాహుల్ కూడా చేరాడు. ఏ ఫార్మాట్‌లో అయినా సరే కేఎల్ రాహుల్ భారత జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.
1990లో అజారుద్దీన్ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించకుండా నేరుగా టెస్టు జట్టుకే కెప్టెన్సీ వహించింది కేఎల్ రాహులే. మధ్యలో ఎంతమంది ఆటగాళ్లు కెప్టెన్‌లుగా మారినా.. వారు ముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్(వన్డే లేదా టీ20)లో నిరూపించుకున్నాకే టెస్టుల్లో నాయకత్వం దక్కింది.
ఇంతకుముందు సునీల్ గవాస్కర్, బీఎస్ బేడీ, అజిత్ వాడేకర్, మరికొందరికి మాత్రమే గతంలో ఈ అవకాశం దక్కింది. గత 30 సంవత్సరాల్లో ఈ ఘనత సాధించింది మాత్రం కేఎల్ రాహులే. ‘దేశానికి నాయకత్వం వహించడం అనేది ప్రతి భారతీయ ఆటగాడి కల. ఈ గౌరవం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను.’ అని కేఎల్ రాహుల్ టాస్ గెలిచాక తెలిపాడు.
ఈ టెస్టు సిరీస్ ముగిశాక దక్షిణాఫ్రికాతోనే జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రాహుల్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సిరీస్‌కు బుమ్రాను వైస్‌కెప్టెన్‌గా ఎన్నుకోవడం విశేషం.
ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ సాధించాడు. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.