భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ ర‌విశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.ఆర్.శ్రీధర్‌లకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు ర‌ద్దు అయిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే ఐపీఎల్‌కు శాపంలా మారింది. 


ఎందుకంటే ప్ర‌స్తుతం భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల‌లో ఉన్న ఆట‌గాళ్లు ప‌లు ఐపీఎల్ టీంల‌కు ఎంతో కీల‌కం. ఇప్ప‌టినుంచి 14 రోజుల పాటు ఐసోలేష‌న్ లో ఉండాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికే ఐపీఎల్ రెండో ద‌శ ప్రారంభ తేదీ కూడా దాటిపోతుంది. సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి యూఏఈలో ఐపీఎల్ రెండో ద‌శ మ్యాచ్ లు ప్రారంభం కావాల్సి ఉంది.


ప్ర‌స్తుతం ఇండియా-ఇంగ్లండ్ టూర్,లో ఉన్న ఆట‌గాళ్లు, వారి ఐపీఎల్ జ‌ట్లు
 1. ముంబై ఇండియ‌న్స్ - రోహిత్ శ‌ర్మ‌, జస్ ప్రీత్ బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్
2. చెన్నై సూప‌ర్ కింగ్ - ర‌వీంద్ర జ‌డేజా, మొయిన్ అలీ, శామ్ క‌ర‌న్, శార్దూల్ ఠాకూర్
3. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ - జానీ బెయిర్ స్టో, వృద్ధిమాన్ సాహా
4. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు - విరాట్ కోహ్లి, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్
5. ఢిల్లీ క్యాపిట‌ల్స్ - అజింక్య ర‌హానే, రిషబ్ పంత్, ఉమేష్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, అక్ష‌ర్ ప‌టేల్, పృథ్వీ షా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, క్రిస్ వోక్స్
6. కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ - కేఎల్ రాహుల్, మ‌యాంక్ అగ‌ర్వాల్, డేవిడ్ మ‌ల‌న్, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ
7. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ - జోస్ బ‌ట్ల‌ర్
8. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ - ప్రసీద్ కృష్ణ 


అన్ని ఐపీఎల్ జట్ల‌లోనూ ప్ర‌స్తుత సిరీస్ ఆడుతున్న ప్లేయ‌ర్లు ఉన్నారు. అయితే వీరు ఐపీఎల్ కు దూర‌మైనా, ఆల‌స్యంగా జ‌ట్ల‌లోకి వ‌చ్చినా.. అన్ని జ‌ట్లూ న‌ష్ట‌పోతాయి.


ఒక‌వేళ అలాంటి ప‌రిణామం జ‌రిగితే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు జ‌రిగే న‌ష్టం అత్యంత తీవ్రంగా ఉండ‌నుంది. ఎందుకంటే ఏకంగా ఎనిమిది మంది కీలక ఆట‌గాళ్లు జ‌ట్టుకు దూరం అవుతారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో కీలక ఆల్ రౌండ‌ర్లు అయిన జ‌డేజా, మొయిన్ అలీ, శామ్ క‌ర‌న్ కూడా ఈ జాబితాలో  ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. ఎందుకంటే చెన్నై 2020 ఘోర వైఫ‌ల్యం నుంచి బ‌య‌ట ప‌డి, 2021లో విజ‌యాల బాట ప‌ట్ట‌డంలో వీరిదే కీలకపాత్ర‌.


బెంగ‌ళూరు, ముంబై, పంజాబ్ జ‌ట్లు అయితే ఏకంగా కెప్టెన్ల‌ను కోల్పోయే అవ‌కాశం ఉంది. కెప్టెన్ల‌తో పాటు ప‌లువురు కీలక ఆట‌గాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.


ఇక స‌న్ రైజ‌ర్స్ కు జానీ బెయిర్ స్టో దూరం అవుతున్న‌ప్ప‌టికీ.. అత‌ని స్థానంలో వార్న‌ర్ తుదిజ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాజ‌స్తాన్ రాయల్స్ నుంచి కీల‌క ప్లేయ‌ర్ జోస్ బ‌ట్ల‌ర్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు నుంచి ప్ర‌సీద్ కృష్ణ ప్ర‌స్తుత టూర్ లో ఉన్నారు.


ఒక‌వేళ వీరు లేక‌పోయినా ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ.. కీల‌క ఆట‌గాళ్లు దూరం అయ్యారు కాబ‌ట్టి ప్రాంచైజీలు నిరాసక్త‌త చూపించే అవ‌కాశం ఉంది. ఐపీఎల్ రెండో ద‌శ ప్రారంభానికి ప‌దిరోజులు కూడా లేవు కాబ‌ట్టి దీనికి సంబంధించిన‌ స్ప‌ష్ట‌త త్వ‌ర‌లోనే రానుంది.