యువ ఆటగాళ్లు పృథ్వీ షా(Pruthvi Shaw), సూర్యకుమార్‌ యాదవ్‌(Suraya Kumar Yadav) ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీలంకలో పర్యటిస్తున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ కోహ్లీసేనలో చేరడం ఖాయమైందని, వీరిద్దరూ ఇంగ్లాండ్‌ వెళ్లి టీమ్‌ఇండియా తరఫున ఆడతారని బీసీసీఐ ప్రకటించింది. స్టాండ్‌ బై ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ సైతం ప్రధాన జట్టులో భాగం కానున్నాడు. అతడితో పాటు వృద్ధిమాన్‌ సాహా, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఐసోలేషన్‌ ముగిసిందని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు.


గాయాల కారణంగా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. స్టాండ్‌ బై పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ ఎడమచేతి బొటన వేలు విరగడంతో అతడూ భారత్‌కు బయల్దేరనున్నాడు. వీరి స్థానాలను పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌తో సెలక్షన్‌ కమిటీ భర్తీ చేయనుంది.



‘సెలక్షన్‌ కమిటీ పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్లను సూచించింది. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డ వేలికి వైద్యం తీసుకున్నాడు. కోలుకొనేందుకు మరింత సమయం పట్టనుంది. బౌలింగ్‌  ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్‌బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ సైతం గాయంతో భారత్‌కు వచ్చేస్తున్నాడు’ అని జే షా తెలిపారు.


కొవిడ్‌-19 నుంచి రిషభ్ పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని జే షా వెల్లడించారు. బీసీసీఐ వైద్య సిబ్బంది అనుమతి రావడంతో టెస్టులకు సన్నద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారని ఊహించినా అలాంటిదేం జరగలేదు. ప్రస్తుతం షా, సూర్యకుమార్ యాదవ్  శ్రీలంకలో బయో బుడగలో ఉన్నారు. అక్కడ్నుంచి నేరుగా ఇంగ్లాండ్‌లోని బుడగకు చేరుకుంటారు. కాబట్టి ఐసోలేషన్‌, క్వారంటైన్‌ నిబంధనలు ఉండకపోవచ్చు!


 అగస్టు 4 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య పటౌడి ట్రోఫీ ప్రారంభం కానున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం బీసీసీఐ 24 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ పంపించింది. అయితే వీరిలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ గాయపడి ఇంటికి తిరిగి వచ్చేశారు. దీంతో తమకు బ్యాకప్ క్రికెటర్లు కావాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కోరింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు జట్టు కోసం పంపిస్తోంది.


స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పృథ్వీషాను పక్కన పెట్టారు. అయితే ఇండియాలో జరిగిన తొలి దశ ఐపీఎల్‌లో పృథ్వీషా విశేషంగా రాణించాడు. స్వింగ్ డెలివరీలతో పడుతున్న ఇబ్బందిని అధిగమించి దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టెస్టు జట్టులో మరోసారి చోటు దక్కింది.


సూర్యకుమార్ యాదవ్ 2020 ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పుడే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడని భావించినా కాలేకపోయాడు. కానీ, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వన్డేల్లో, శ్రీలంక పర్యటనలో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆదివారం జరిగిన తొలి టీ20లో అర్ద సెంచరీ చేశాడు. 2019-20 రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన యాదవ్.. 10 ఇన్నింగ్స్‌లో 508 పరుగులు చేశాడు.