సేమ్ టు సేమ్...భారత పురుషుల హాకీ జట్టు ఎలాగైతే సెమీస్‌లో ఓడి కాంస్య పోరు కోసం సన్నద్ధమౌతుందో... అలాగే మహిళల జట్టు కూడా సెమీస్‌లో ఓడి కాంస్య పోరు కోసం ఎదురుచూస్తోంది. మహిళల సెమీస్‌లో భాగంగా ఈ రోజు అర్జెంటీనా... భారత్ తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ 1-2 తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ ఆశలకు గండి పడింది. 


కీలకమైన సెమీస్‌లో రాణి సేన 1-2 తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు గెలుపు కోసం భారత్ పోరాడినా... ప్రత్యర్థి జట్టు అడ్డుకుంటూనే ఉంది. భారత క్రీడాకారిణి గుర్జీత్‌ కౌర్‌ మాత్రమే గోల్‌ చేసింది. అర్జెంటీనాలో ప్లేయర్
మరియా నోయెల్‌ 2 గోల్స్‌ చేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. కాంస్య పోరులో భారత్...గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. 


అర్జెంటీనాకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో రెండింటిని గోల్స్‌గా మలిచింది. భారత్‌కు వచ్చిన 3 పీసీల్లో రెండింటిని ప్రత్యర్థి విజయవంతంగా అడ్డుకొంది. పురుషుల జట్టు కూడా సెమీఫైనల్లో ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ రూపంలోనే గోల్స్ సమర్పించి మ్యాచ్ చేజార్చుకుంది. 
 


ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే టీమ్‌ఇండియా ప్లేయర్ గుర్జీత్ కౌర్ గోల్‌ చేసింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చడంలో గుర్జిత్‌ కౌర్‌ విజయవంతమైంది. ఆ తర్వాత రెండు జట్లు గోల్ సాధించేందుకు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. దీంతో తొలి క్వార్టర్‌ 1-0తో ముగించింది రాంపాల్‌ సేన. ఇక రెండో క్వార్టర్లో కాస్త ఒత్తిడికి గురైన టీమిండియా కొన్ని పొరపాట్లు చేసింది. ఇది అర్జెంటీనాకు కలిసొచ్చింది. 18వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను ప్రత్యర్థి సారథి మరియా నోయెల్‌ గోల్‌గా మలిచింది. దాంతో 1-1తో రెండో క్వార్టర్‌ ముగిసింది.


ఇక మూడో క్వార్టర్లో భారత జట్టు గోల్‌ చేసేందుకు బాగా శ్రమించింది. 36వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ కార్నర్‌ లభించింది. మరియా చేసిన గోల్‌ని మన గోల్ కీపర్ సవిత సమర్థవంతంగా అడ్డుకోలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. దీంతో భారత్‌ జట్టుపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఆఖరి క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు రాణి సేన చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఎట్టకేలకు భారత్‌కు పెనాల్టీ కార్నర్ రూపంలో ఓ అవకాశం వచ్చింది. కానీ, ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ మరియా బెలెన్ దానిని అడ్డుకుంది. ఆట అర నిమిషంలో ముగుస్తుందనగా వచ్చిన ఫ్రీహిట్‌ను గోల్‌ చేసేందుకు టీమ్‌ఇండియా ప్రయత్నిస్తే మళ్లీ బెనెల్‌ కిందపడి మరీ ఆపేయడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి.