Asia Cup, India's Predicted 11: ఆసియాకప్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేయగానే అందర్లోనూ ఒకటే ఆసక్తి! దాయాదుల సమరంలో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరెవరు ఓపెనింగ్ చేస్తారు? పేస్ బౌలింగ్ బాధ్యతలను ఎవరు నెరవేరుస్తారు? జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది అని!
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అందరికన్నా ముందున్నాడు. తుది జట్టను అంచనా వేశాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రాహుల్ విరామం తర్వాత వస్తుండటంతో జట్టులో డెప్త్ అవసరమని సూచించాడు. బ్యాటింగ్ హెవీ టీమ్‌ను ఎంచుకోవాలని అంటున్నాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియాకప్ ఆగస్టు 27న యూఏఈ వేదికగా మొదలవుతుంది. ఆ మరుసటి రోజే చిరకాల శత్రువులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. లీగ్ దశలోనే కాకుండా సూపర్ 4లోనూ ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వీరే కాకుండా మరో ముగ్గురు స్టాండ్‌బైగా యూఏఈ వెళ్తారు.
భారత్, పాక్ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, అవేశ్ ఖాన్‌కు ఆకాశ్ చోప్రా చోటివ్వలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే మూడో స్థానంలో ఆడతాడని వెల్లడించాడు. కుడి, ఎడమ కూర్పు కోసం రిషభ్ పంత్ నాలుగు, సూర్య కుమార్ ఐదో స్థానంలో రావాలన్నాడు.
వీరిద్దరి తర్వాత హార్దిక్ పాండ్య, దీపక్ హుడా వస్తే మంచిదని ఆకాశ్ చోప్రా తెలిపాడు. విరాట్, రాహుల్ చాలా రోజుల తర్వాత వస్తుండటంతో బ్యాటింగ్ లైనప్‌లో మరింత డెప్త్ అవసరమన్నాడు. అందుకే దినేశ్ కార్తీక్ బదులు దీపక్ హుడాను తీసుకుంటానని వెల్లడించాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ స్పిన్ బౌలింగ్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ పేస్ బౌలింగ్ దాడి చూసుకుంటారని పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రా XI: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్