INDIA WIN THE ASIAN CHAMPIONS TROPHY 2024: అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న భారత హాకీ( India hockey) జట్టు మరోసారి మెరిసింది. ఒలింపిక్స్(Olympics) లో వరుసగా రెండోసారి పతకం గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న భారత హకీ ఆటగాళ్లు... ఆసియా  ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy 2024)ని కైవసం చేసుకున్నారు. అయిదోసారి భారత జట్టు ఈ ట్రోఫీని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఫైనల్లో చైనా(Chaina) నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జట్టు పట్టు విడవలేదు. కానీ ఈ మ్యాచులో చైనా పోరాటం కూడా ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాపై 1-0తో విజయం సాధించింది. భారత్-చైనా జట్లు హోరాహోరాగి తలపడడంతో చివరి క్వార్టర్ వరకూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. చివరి క్వార్టర్ లో జుగ్ రాజ్ సింగ్(Jugraj Singh గోల్ చేయడంతో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోకుండా కప్పు కైవసం చేసుకుంది. 






హోరాహోరీ తలపడ్డారు..
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. లీగ్ దశలో చైనాను కూడా టీమిండియా 3-0తో చిత్తు చేసింది. ఇక ఫైనల్లో మరోసారి చైనాతోనే తలపడాల్సి రావడంతో భారత్ విజయం తేలికే అని అంతా అనుకున్నారు. కానీ చైనా తీవ్రంగా పోరాడింది. భారత ఆటగాళ్ల దాడులను కాచుకున్న డ్రాగన్ జట్టు... సమయం చిక్కినప్పుడల్లా భారత గోల్ పోస్ట్ పై దాడులు కూడా చేసింది. అయితే భారత డిఫెన్స్  ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంది. కానీ భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. రెండు జట్లు తీవ్రంగా పోరాడడంతో ఫస్ట్ క్వార్టర్ లో ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. కానీ ఫస్ట్ క్వార్టర్లో భారత్ కు మంచి అవకాశం లభించింది. సుఖ్‌జీత్ చీకీ దాదాపు గోల్ చేసినంత పని చేశాడు. కానీ చైనా గోల్ కీపర్ దాన్ని అద్భుతంగా అడ్డుకున్నాడు. 9వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ అది గోల్ గా మారలేదు. రెండో క్వార్టర్లో భారత్ కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా అవి వృథా అయ్యాయి. ఆ తర్వాత కూడా భారత్ కు కొన్ని అవకాశాలు లభించినా చైనా ఢిఫెన్స్ వాటిని అడ్డుకుంది. దీంతో తొలి సగం ఆట 0-0తో ముగిసింది. మూడో క్వార్టర్ లోనూ భారత్ పదే పదే చైనా డీ ప్రాంతంలోకి దూసుకెళ్లి దాడులు చేసింది. కానీ చైనా డిఫెన్స్ దుర్భేద్యంగా ఉండడంతో గోల్స్ రాలేదు. కానీ 41వ నిమిషంలో చైనా ప్లేయర్ హుందాల్ భారత డీ విభాగంలోకి దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ హుందాల్ షాట్ గోల్ పోస్టుకు దూరంగా వెళ్లడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మూడో క్వార్టర్ లోనూ ఇరు జట్లూ ఎలాంటి గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ నాలుగో క్వార్టర్ కు మళ్లింది. 






జుగ్ రాజ్ గోల్ తో...
చివరి క్వార్టర్లో అయినా భారత్ గోల్ చేస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగింది. అయితే ఈ ఉత్కంఠకు 51 వ నిమిషంలో తెరపడింది. హర్మన్ ప్రీత్ ఇచ్చిన మంచి పాస్ ను అందుకున్న జుగ్‌రాజ్‌ అద్భుత గోల్ తో మెరిశాడు. ఈ గోల్ తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా దాడుల తీవ్రతను మరింత పెంచింది. పదే పదే భారత గోల్ పోస్టుపై దాడి చేసింది. అయితే భారత గోల్ కీపర్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. భారత్‌ డిఫెన్స్‌ పటిష్టంగా ఉండడంతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ అయిదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం మరోసారి విజేతగా నిలిచింది.