India Playing XI Cape Town Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు టీమ్‌ఇండియా సిద్ధం అవుతోంది. సిరీస్‌ 1-1తో సమం కావడంతో కేప్‌టౌన్‌ టెస్టులో కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఉంది. ఈ మ్యాచులో కొన్ని కీలక మార్పులు చేయనుంది! రిషభ్ పంత్‌, హైదరాబాదీ ఆటగాళ్లు హనుమ విహారి, మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కకపోవచ్చు.


వాండరర్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా మరికొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. బౌలర్లు ఇంకా ఎక్కువ పోరాడేవారు. అందుకే రెండో టెస్టులో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ సాధించినట్టే కనిపిస్తున్నాడు. అతడి రాకతో హనుమ విహారికి చోటు కష్టమే! అతడి 40 పరుగుల ఇన్నింగ్స్‌ విలువైనదే అయినా చోటు నిలబెట్టుకొనేందుకు సరిపోదు.


విహారి బాధపడాల్సిన అవసరం లేదని ద్రవిడ్‌ అంటున్నాడు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నారని గుర్తు చేశాడు. 'రెండు ఇన్నింగ్సుల్లో హనుమ విహారి బాగా ఆడాడు. రెండో ఇన్నింగ్సులోనైతే అతడి ఆట అద్భుతం. గతంలో శ్రేయస్‌ అయ్యర్‌ సైతం రాణించాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారీ వీరు మనసు పెట్టి ఆడుతున్నారు. కానీ కొన్నిసార్లు జట్టులో చోటు దొరకదు. విరాట్‌, అజింక్య యువకులుగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు' అని మిస్టర్‌ వాల్‌ తెలిపాడు.


కోహ్లీ రాకతో విహారికి చోటు దొరకదని అర్థమైంది. ఇక యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను ఆడించినా ఆశ్యర్యం లేదు! ఎందుకంటే అతడు చెత్త షాట్లు ఆడిన విధానంపై కోహ్లీ, ద్రవిడ్‌ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. వారే కాదు క్రికెట్‌ విశ్లేషకులు సైతం అతడు మరింత పరిణతిగా ఆడాలని సూచిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేప్‌టౌన్‌లో మరో అవకాశం ఇచ్చినా చెప్పలేం.


ఇక యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆడటమూ కష్టమే! రెండో టెస్టులో అతడి పిక్క కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. సామర్థ్యం మేరకు బౌలింగ్‌ చేయలేదు. చాలాసేపు మైదానం బయటే ఉన్నాడు. అతడి పనిభారం, ఫిట్‌నెస్‌ను బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ లేదా ఇషాంత్ శర్మకు చోటు దొరకనుంది.


భారత జట్టు (అంచనా):  కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రిషభ్ పంత్‌/ వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ / ఇషాంత్‌ / సిరాజ్‌