భారత్‌లో క్రికెట్‌కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పగలు, రాత్రి మ్యాచ్లు ఎప్పుడు ఉన్న అభిమానులు ఆదరిస్తారు. విదేశీ గడ్డలపై మ్యాచ్లు ఉన్నప్పుడు కూడా సమయంతో సంబంధం లేకుండా చూస్తారు. దీంతో కొన్ని మ్యాచ్లు రికార్డు స్థాయిలో వీక్షకులను సంపాదించుకుంటాయి. టీవీలతో పాటు ఓటీటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. దీంతో గణనీయంగా మ్యాచ్లు చూసే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్ వీక్షణల పరంగా అదరగొట్టింది. ఈ ఫైనల్ కోసం రెండేళ్ల పాటు మ్యాచ్లు జరిగాయి. వీటన్నింటిలో ఫైనల్ ఎక్కువ మంది చూసిన పోరుగా రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 177 మిలియన్ల వీక్షకులు భారత్, న్యూజిలాండ్ పోరును ఆస్వాదించారు. 89 ప్రాంతాల నుంచే 130.6 మిలియన్ల లైవ్ వ్యూయర్‌షిప్ లభించడం ఆశ్చర్యకరం.
న్యూజిలాండ్‌లో తక్కువ జనాభా ఉన్నా వ్యూయర్‌షిప్ బాగుండటం విశేషం. దాదాపుగా 200,000 మంది రాత్రంతా నిద్రపోకుండా, ఉదయాన్నే లేచి ఫైనల్ పోరును వీక్షించారు. బ్రిటన్‌లోని స్కై స్పోర్ట్స్‌లోనూ 2019-2021 ఛాంపియన్‌షిప్ మ్యాచుల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్ ఇదే కావడం ప్రత్యేకం.
భారత్‌లోనే ఫైనల్‌ను అత్యధిక మంది వీక్షించారు. స్టార్‌స్పోర్ట్స్, దూరదర్శన్ ద్వారా 94.6% మంది మ్యాచ్ చూశారు. స్థానిక భాషల్లో కూడా మ్యాచ్లు ప్రసారం చేయడంతో వీక్షకుల సంఖ్య పెరిగేందుకు ఉపయోగపడిందని ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా(Anurag Dahiya) అన్నారు.
ICC.TV ఓటీటీ ద్వారా 145 ప్రాంతాల్లో అదనంగా 6,65,100 ప్రత్యక్ష వీక్షణలు లభించాయి. మొత్తంగా 14 మిలియన్ల వీక్షణా నిమిషాలకు ఇది సమానం. రిజర్వుడే రోజు ఐసీసీ వేదికల ద్వారా వీడియో కంటెంట్‌ను 500 మిలియన్లకు పైగా చూశారు. ఐసీసీ డిజిటల్ అసెట్స్‌లో ఫేస్‌బుక్ ద్వారానే 423 మిలియన్ల వ్యూస్, 368 మిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి.
ఒక రిజర్వ్ డే నాడే ఐసీసీ ఫేస్‌బుక్ నుంచి 24 గంటల వ్యవధిలో 65.7 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు లభించాయి. 2020, మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ 64.3 మిలియన్ల కన్నా ఇది ఎక్కవే. ఐసీసీ ఇన్‌స్టా ద్వారానూ 70 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు వచ్చాయి. ఐసీసీ అన్ని డిజిటల్ ఖాతాల ద్వారా 515 మిలియన్ల వీడియో వ్యూస్ రావడమూ ఓ రికార్డే. ఈ రికార్డును సెప్టెంబరులో జరగబోయే IPL సీజన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ని వీక్షకులు రికార్డు స్థాయిలోనే వీక్షిస్తారు. సెప్టెంబరులో ప్రారంభమయ్యే IPL సీజన్లో తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది.