దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఐదో రోజు లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చివరిరోజు ఆటలో ఇంకా 73 ఓవర్లు మిగిలి ఉన్నాయి. భారత్ విజయానికి మూడు వికెట్లు కావాల్సి ఉండగా.. దక్షిణాఫ్రికా గెలవాలంటే 123 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం మాత్రం పక్కా.
94-4 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండానే ఆడింది. అయితే ఐదోరోజు ఆటలో పదో ఓవర్ చివరి బంతికి క్రీజులో నిలదొక్కుకున్న డీన్ ఎల్గర్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి బుమ్రా భారత్‌కు మంచి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ (21: 28 బంతుల్లో, రెండు ఫోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. అయితే తనని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటనే వియాన్ ముల్డర్ (1: 3 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఈ వికెట్ షమీకి దక్కింది. టెంపా బవుమా (34: 78 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పోరాడుతున్నాడు.
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 197 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యం నిలిచింది.