భారత్ X ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో ఇంగ్లాండ్ అభిమానులు భారత్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టులో భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పై బాటిల్ మూతలను విసిరారు. తాజాగా ఇలాంటి ఆకతాయి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
భారత్ x ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్... ఇంగ్లాండ్ బౌలర్ల ప్రదర్శనకు చేతులెత్తేశారు. కేవలం 78 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లాండ్ ఆధిక్యం సాధించిన అనంతరం ఓ అభిమాని భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పై బంతిని విసిరాడు. ఇది చూసిన కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వెంటనే అంపైర్‌తో దీనిపై చర్చించాడు కూడా.
సిరాజ్ పై బంతి విసిరిన అభిమాని అంతటితో ఆగకుండా... అతడ్ని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. భారత్ స్కోరు ఎంత అని ఎగతాళిగా అడిగాడు. దానికి సిరాజ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. సిరాజ్... మాకు ఒకటి, మీకు సున్నా అని చూపించాడు. ఒకటి అంటే ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌లో భారత్ ఆధిక్యం అని అర్థం. సున్నా అంటే ఇంగ్లాండ్ ఒక్క టెస్టు కూడా గెలవలేదు అని అర్థం. సిరాజ్ సంజ్ఞలతో ఆ అభిమానికి ఊహించని పంచ్ పడినట్లైంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్ అభిమానికి భలే కౌంటర్ ఇచ్చావంటూ భారత అభిమానులు సిరాజ్‌ను వెనకేసుకొచ్చారు. ఇంగ్లీష్ వాళ్లకి హైదరాబాద్ స్పైస్ ఏంటో చూపించావు అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికెట్ కీపర్ రిషబ్ పంత్ మీడియాతో ఏమని అన్నాడంటే... ఎవరో సిరాజ్‌పై బాల్ విసిరారు. దీనిపై కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే. మీరు ఏదైనా అనాలనుకుంటే అనండి. కానీ, ఇలా ఫీల్డర్లపై వస్తువులు విసరకండి. అది క్రికెట్‌కు మంచిది కాదు అని పంత్ అన్నాడు.