భారత క్రికెట్‌ను కరోనా వీడేలా కనిపించడం లేదు! ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా? ఎంతగా బయో బుడగల్లో ఉంచుతున్నా? కొవిడ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు కరోనా సోకినట్టు సమాచారం. దీంతో జనవరి 19 నుంచి ఆరంభమయ్యే దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీసులో అతడు ఆడటం సందేహమే! ఎందుకంటే అతడు ముంబయిలోని ఇతర జట్టు సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు ప్రయాణించే అవకాశం లేదు.


వాషింగ్టన్‌ సుందర్‌ దక్షిణాఫ్రికాకు వెళ్లే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో చెప్పినట్టు తెలిసింది. 'కొద్ది రోజుల క్రితమే అతడికి పాజిటివ్‌ వచ్చింది. అతడు జట్టుతో పాటు ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకున్నారు' అని ఆ అధికారి వెల్లడించారు.







Also Read: ప్రపంచకప్‌ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!


Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!


దాదాపుగా పది నెలల నుంచి వాషింగ్టన్‌ సుందర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2021, మార్చిలో చివరి మ్యాచ్‌ ఆడాడు. గాయాల పాలవ్వడమే ఇందుకు కారణం. వాటి నుంచి కోలుకున్న సుందర్‌ తమిళనాడు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. తన ప్రదర్శనతో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఇప్పుడు కొవిడ్‌ సోకడంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడి పునరాగమనం మరింత ఆలస్యం కానుంది.


సుందర్‌ స్థానంలో మరెవరినైనా దక్షిణాఫ్రికాకు పంపించాలా లేదా అని చేతన్‌ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికైతే కమిటీ అధికారికంగా సమావేశం కాలేదు. ఈ మేరకు ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షాతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కేఎల్‌ రాహుల్ నాయకత్వం వహించబోయే వన్డే సిరీసుకు ఇప్పటికే రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.