IND vs ZIM: జింబాబ్వే కోచ్‌ డేవ్‌ హ్యూస్టన్‌ టీమ్‌ఇండియాకు వార్నింగ్‌ ఇచ్చాడు! బీసీసీఐ ఎలాంటి జట్టును పంపించినా తాము గట్టి పోటీనిస్తామని అంటున్నాడు. భారత్‌ ఆటను ఆస్వాదిస్తూ కూర్చోబోమని గెలిచేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు.


దాదాపుగా ఆరేళ్ల తర్వాత టీమ్‌ఇండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని జట్టు శనివారం ఉదయమే విమానంలో అక్కడికి బయల్దేరింది. ఆగస్టు 18, 20, 22న హరారే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఈ వన్డే సిరీస్‌ జరుగుతోంది.


మొత్తం 13 జట్లు ఈ లీగులో తలపడుతున్నాయి. ఎక్కువ మ్యాచులు గెలిచినవాళ్లు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. ఈ లీగులో ఇప్పటి వరకు జింబాబ్వే 15 మ్యాచులాడి కేవలం మూడే  గెలిచింది. భారత్‌ చివరిసారిగా 2016లో అక్కడ పర్యటించింది. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది.


'కొన్నేళ్లుగా మేం భారత క్రికెట్‌, ఐపీఎల్‌ను విపరీతంగా చూస్తున్నాం. బీసీసీఐ 3, 4 జట్లను అత్యంత సులువగా దింపగలదు. ప్రపంచ క్రికెట్లో మొదటి, రెండో, మూడో, నాలుగో శ్రేణి జట్లను ఆడించగలదు. వారు పంపించే జట్టేదైనా పటిష్ఠంగానే ఉంటుందని మాకు తెలుసు. అందులో ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ అనుభవం ఉంటుందని ఎరుకే. అందుకే మాకిది కఠిన సవాల్‌' అని డేవ్‌ అన్నాడు.


'చాన్నాళ్ల తర్వాత టీమ్‌ఇండియా జింబాబ్వేలో పర్యటిస్తుందని మా కుర్రాళ్లకు చెప్పాను. భారీ స్కోర్లు చేసి, మెరుగైన  ఫలితాలు సాధించేందుకు ఇదో మంచి అవకాశమని గుర్తు చేశాను. భారత్‌ ఆడే గొప్ప క్రికెట్‌ను చూసేందుకో, సంఖ్యా పరంగా మరో మూడు మ్యాచుల్ని ముగించేందుకో మనం పరిమితం అవ్వొద్దని చెప్పా. రాహుల్‌ సేనకు సవాళ్లు విసరగలమన్న నమ్మకం నింపాను. ఈ మూడు వన్డేల్లో మేం టీమ్‌ఇండియాకు పెను సవాళ్లు విసరగలమనే నా విశ్వాసం' అని హ్యూస్టన్‌ పేర్కొన్నాడు.


భారత జట్టులోని రెగ్యులర్ వన్డే సభ్యులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. జింబాబ్వేకు వికెట్ కీపర్-బ్యాటర్ రెగిస్ చకబ్వా నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ హ్యామ్‌స్ట్రింగ్ టియర్‌తో బాధపడుతున్నందున అతను సిరీస్‌కు దూరమయ్యాడు. జింబాబ్వే కూడా బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా, వెల్లింగ్టన్ మసకద్జా లేకుండానే బరిలోకి దిగనుంది.


మూడు వన్డేలకు భారత జట్టు


కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్