IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఆశించిన దానికన్నా ఎక్కువే ఎంటర్‌టైన్‌ చేస్తోంది. రెండు మ్యాచులు గెలిచిన టీమ్‌ఇండియా ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకుంది. ట్రినిడాడ్‌లో జరిగే ఆఖరి వన్డేలోనూ గెలిచి వరుసగా రెండో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని గబ్బర్‌ సేన పట్టుదలగా ఉంది. కనీసం ఒక్క పోరైనా గెలవాలని కరీబియన్లు కోరుకుంటున్నారు. మరి నేటి మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్టులో ఉండేదెవరు?


సీనియర్లు లేకున్నా!


రోహిత్‌, కోహ్లీ, రాహుల్, బుమ్రా, షమి లేనప్పటికీ టీమ్‌ఇండియా రాణిస్తోంది. ప్రతి మ్యాచులో ఎవరో ఒకరు నిలుస్తున్నారు. తొలి మ్యాచులో గబ్బర్‌ రాణిస్తే రెండో వన్డేలో అక్షర్‌ పటేల్‌ అదరగొట్టాడు. మహ్మద్‌ సిరాజ్‌ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్తుతో బౌలింగ్‌ చేస్తున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంటోంది. సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్ హుడా పరుగుల పరంగా బాకీ పడ్డారు. ప్రసిద్ధ్‌ కృష్ణ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. అర్షదీప్‌, రుతురాజ్‌ చోటు కోసం ఎదురు చూస్తున్నారు. 11-40 ఓవర్ల మధ్య టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కలవరపెడుతోంది. దీనిని సరిదిద్దుకోవాలి. బౌలింగ్‌ పరంగా మరికాస్త జాగ్రత్త అవసరం.



కనీసం ఒక్కటైనా!


ఓడినప్పటికీ విండీస్‌ మాత్రం హ్యాపీగానే ఉంటోంది. బంగ్లా సిరీసు కన్నా మెరుగైన ప్రదర్శన చేస్తుండటమే ఇందుకు కారణం. షై హోప్ చక్కని సెంచరీతో అలరించాడు. మిగతా బ్యాటర్లూ దూకుడుగానే ఆడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న జేసన్‌ హోల్డర్‌ ఈ మ్యాచుకు అందుబాటులో ఉంటాడు. డెత్‌లో రొమారియో షెపర్డ్‌ విపరీతంగా పరుగులు ఇస్తున్నాడు. అల్జారీ జోసెఫ్‌ 5.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. డేంజరస్‌గా కనిపిస్తున్నాడు. కీమోపాల్‌, కేసీ కార్టీ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ ఆకలి గొన్న పులిలా కనిపిస్తున్నాడు.


వర్షం పడే ఛాన్స్‌!


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఇప్పటి వరకు ఉపయోగించిన పిచ్‌ బాగుంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. నేటి మ్యాచులో కొత్త పిచ్‌ ఉపయోగించొచ్చు. పది ఓవర్ల వరకు వేచిచూస్తేనే వికెట్‌ స్వభావం అర్థమవుతుంది. రోజంతా ఉరుములు, మెరుపులు కనిపించే అవకాశం ఉంది. అప్పుడప్పుడు జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆటకు అంతరాయం కలగొచ్చు.


India vs West Indies 3rd ODI match Probable XI


భారత్‌: శిఖర్ ధావన్‌ (కె), రుతురాజ్‌ గైక్వాడ్‌ / ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అవేశ్ ఖాన్‌ / ప్రసిద్ధ్‌  కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌


వెస్టిండీస్‌: షై హోప్‌, బ్రాండన్‌ కింగ్‌, షామ్రా బ్రూక్స్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌, రోమన్‌ పావెల్‌, జేసన్‌ హోల్డర్‌, అకేల్‌ హుస్సేన్‌, అల్జారీ జోసెఫ్‌, గుడాకేశ్‌ మోటీ, జేడెన్‌ సీల్స్‌