వెస్టిండీస్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా రెడీ అయిపోయింది! ఈ మ్యాచ్‌ గెలిచి సిరీసును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పోరు జరిగేది మళ్లీ ఈడెన్‌లోనే కాబట్టి జట్టులో ఎక్కువ మార్పులేమీ ఉండకపోవచ్చు. మరోవైపు పొట్టి క్రికెట్లో కరీబియన్లను నమ్మేందుకు వీల్లేదు! వారు బలంగా పుంజుకున్నా ఆశ్చర్యం లేదు. విజయం కోసం విధ్వంసాలు సృష్టించగలరు. అందుకే రెండో టీ20 ఆసక్తికరం!


Ishan Kishan బ్యాటింగ్‌ కలవరం


తొలి మ్యాచులో అదరగొట్టినప్పటికీ టీమ్‌ఇండియాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఒత్తిడిలో ఆడటం కలవరపరిచింది. అతడు ఫుల్‌టాస్‌ బంతులనూ బౌండరీలుగా మలవలేదని సునీల్‌ గావస్కర్‌, ఆకాశ్ చోప్రా, సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శించారు. పైగా ఆఫ్‌సైడ్‌ వేసిన బంతులకు స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంలో విఫలమయ్యాడు. 42 బంతుల్లో 35 పరుగులే చేశాడు. చాన్నాళ్లుగా ఇషాన్‌ కిషన్‌ సమస్య తనకు తెలుసని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటున్నాడు. అతడిపై నమ్మకం ఉంచుతానని పేర్కొన్నాడు. బహుశా అతడికి మరో అవకాశం ఇస్తుండొచ్చు. కానీ చాలామంది ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. ఒకవేళ జట్టు యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంటే రుతురాజ్‌ తుది 11 మందిలో ఉంటాడు.


Venkatesh Iyer, Deepak chahar గాయాలపై నో అప్‌డేట్‌


మొదటి మ్యాచులో హిట్‌మ్యాన్‌ విధ్వంసం అందరికీ నచ్చింది. రెండో మ్యాచులోనూ అలాగే ఆడాలని కోరుకుంటున్నారు. అయితే విరాట్‌ కోహ్లీ విఫలమవ్వడం నిరాశపరిచింది. ఇక నాలుగో స్థానంలో రిషభ్ పంత్‌ పరుగులు చేయకపోవడం కలవరపరుస్తోంది. బహుశా అతడిని తీయకపోవచ్చు. ఐదు, ఆరు స్థానాల్లో సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. సూర్య దాదాపుగా జట్టులో స్థిరపడ్డట్టే! గాయపడ్డ వెంకటేశ్ పరిస్థితిపై అప్‌డేట్‌ లేదు. ఇక దీపక్‌ చాహర్ గాయం నయం కాకుంటే శార్దూల్‌ ఠాకూర్‌ను ఆడిస్తారు. భువి, హర్షల్‌ పటేల్‌, చాహల్‌ ఎప్పట్లాగే ఆడతారు. తొలి పోరులో 2 వికెట్లు తీసి తన గూగ్లీలతో కరీబియన్లను వణికించిన రవి బిష్ణోయ్‌కు ఇకపై వరుసగా అవకాశాలు దొరుకుతాయి. వచ్చే మ్యాచులో చాహల్‌ స్థానంలో కుల్‌దీప్‌కు చోటివ్వొచ్చు.


Team India Playing XI prediction


టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ / రుతురాజ్ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌ / శార్దూల్‌ ఠాకూర్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్‌