IND vs WI 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది! కుర్రాళ్లే అయినా తొలి పోరులో ఉత్కంఠ రేకెత్తించారు. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడంతో అభిమానులు థ్రిల్‌ ఫీలయ్యారు. నేటి మ్యాచులోనూ గెలిచి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని గబ్బర్‌ సేన పట్టుదలగా ఉంది. కొన్ని రోజులుగా ఓటమితో విసుగు చెందిన కరీబియన్లు విజయం కోసం పట్టుదలగా ఉన్నారు. మరి నేడు గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు?


ఆ ఇద్దరూ ఆడితే!


ప్రస్తుతం టీమ్‌ఇండియా ఎదురు లేకుండా సాగుతోంది. ఆఖరి వరకు పోరాట పటిమ కనబరుస్తుండటం సానుకూల అంశం. కెప్టెన్‌ గబ్బర్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నా అందర్నీ ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ సైతం రాణించాడు. అర్ధశతకాలను అతడు సెంచరీలుగా మలవాల్సి ఉంది. వన్‌డౌన్‌లో శ్రేయస్‌ ఫర్వాలేదనిపించాడు. సంజు శాంసన్‌, దీపక్‌ హుడా అవకాశలను ఒడిసిపట్టాలి. బౌలింగ్‌ పరంగా మరింత తెగవ చూపించాలి. ఫ్లాట్‌ పిచ్‌ల పైనా వికెట్లు పడగొట్టే ప్రణాళికలు రచించాలి. జడ్డూ గాయం నుంచి కోలుకోలేదు. అక్షర్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ లేదు. బహుశా జట్టులో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు.


గెలిచినంత ఆనందం


తొలి వన్డే ప్రదర్శనతో వెస్టిండీస్‌ చాలా ఆనందంగా ఉంది! ఎందుకంటే కొన్ని రోజులుగా వారు ఇలాంటి ఆటే ఆడలేదు. చివరి ఆరు వన్డేల్లో ఐదింట్లో ఘోర పరాజయాలే ఎదురయ్యాయి. కనీసం 50 ఓవర్లైనా బ్యాటింగ్‌ చేయలేకపోయారు. అందుకే కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ సంతోషంగా ఉందన్నాడు. మొదటి మ్యాచులో అందరూ రాణించడం శుభసూచకం. షై హోప్‌, మేయర్స్‌, పూరన్‌, పావెల్‌, షెపర్డ్‌, హుస్సేన్‌ ఎప్పటికీ ప్రమాదకారులే. చివరి మ్యాచులో వారి బౌలింగ్‌ సైతం బాగుంది. 350+ స్కోర్‌ చేయకుండా టీమ్‌ఇండియాను అడ్డుకున్నారు. అందుకే నేటి మ్యాచులో అప్రమత్తంగా ఉండాలి. కరోనా వల్ల జేసన్‌ హోల్డర్‌ అందుబాటులో ఉండడు.


టీమ్‌ఇండియా కింగ్‌


పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్‌పార్క్‌ ఓవల్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. కొత్త బంతితో పరుగుల వరద పారుతుంది. బంతి పాతబడితే మాత్రం ఆగి వస్తుంది. బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. ఆసియా బయట టీమ్‌ఇండియాకు ఇది అచ్చొచ్చిన వేదిక. ఏకంగా 12 మ్యాచులు గెలిచింది. 16 మ్యాచులు గెలిచిన హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ తర్వాత భారత్‌ ఇక్కడే ఎక్కువ ఎంజాయ్‌ చేస్తుంది.


India vs West Indies 2nd ODI match Probable XI


భారత్‌: శిఖర్ ధావన్‌ (కె), రుతురాజ్‌ గైక్వాడ్‌ / ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అవేశ్ ఖాన్‌ / ప్రసిద్ధ్‌  కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌


వెస్టిండీస్‌: షై హోప్‌, బ్రాండన్‌ కింగ్‌, షామ్రా బ్రూక్స్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌, రోమన్‌ పావెల్‌, జేసన్‌ హోల్డర్‌, అకేల్‌ హుస్సేన్‌, అల్జారీ జోసెఫ్‌, గుడాకేశ్‌ మోటీ, జేడెన్‌ సీల్స్‌