వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 238 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (64: 83 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెప్టెన్ రోహిత్ శర్మతో (5: 8 బంతుల్లో) పాటు రిషబ్ పంత్ (18: 34 బంతుల్లో, మూడు ఫోర్లు) ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు వచ్చాడు. అయితే రోహిత్ ప్రయోగం ఫలించలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ శర్మను అవుట్ చేసి కీమర్ రోచ్ భారత్‌కు మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలను (18: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) ఇన్నింగ్స్ 12వ ఓవర్లలో అవుట్ చేసిన ఒడియన్ స్మిత్ భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 43 పరుగులు మాత్రమే.
ఈ దశలో కేఎల్ రాహుల్ (49: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వేగంగా ఆడాడు. భారత్ ఇన్సింగ్స్‌లో నమోదైన రెండు సిక్సర్లనూ కేఎల్ రాహులే కొట్టాడు. సూర్యకుమార్ క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో కేఎల్ వేగంగా ఆడటంతో రన్‌రేట్ నిలకడగా సాగింది. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కేఎల్ రాహుల్ అవుటయ్యాడు.
కేఎల్ రాహుల్ అవుట్ కావడం క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో (24: 41 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దరూ కూడా అవుటయ్యారు. చివర్లో దీపక్ హుడా (29: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడాడు. అయితే టెయిలెండర్లలో ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. చివర్లో చాహల్ (11 నాటౌట్: 10 బంతుల్లో, ఒక ఫోర్) విలువైన పరుగులు జోడించాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకేల్ హొస్సేన్, ఫాబియన్ అలెన్‌లు తలో వికెట్ తీశారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్‌కు వికెట్ దక్కడం విశేషం.