తొలి టీ20లో వెస్టిండీస్‌ మోస్తరు స్కోరు చేసింది! ఈడెన్‌లో టీమ్‌ఇండియాకు 158 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. కష్టాల్లో పడ్డ జట్టును నికోలస్‌ పూరన్‌ (61; 43 బంతుల్లో 4x4, 5x6) రక్షించాడు. బౌలర్లను గౌరవిస్తూనే సిక్సర్లు బాదేశాడు. అర్ధశతకం కొట్టేశాడు. అతడికి తోడుగా కైల్‌ మేయర్స్‌ (31; 24 బంతుల్లో 7x4) రాణించాడు. ఆఖర్లో బిగ్‌మ్యాన్‌ కీరన్‌ పొలార్డ్‌ (24*; 19 బంతుల్లో 2x4, 1x6) మెరిశాడు. రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు. భువీ, దీపక్‌, చాహల్‌కు తలో వికెట్‌ దక్కింది.


Nicholas Pooran షో


టాస్‌ గెలిచిన రోహిత్‌ విండీస్‌ను మొదట బ్యాటింగ్‌కు దించాడు. తొలి ఓవర్‌ ఐదో బంతికే బ్రాండన్‌ కింగ్‌ (4)ను భువీ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్‌ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్‌ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్‌ బౌండరీ లైన్‌ తొక్కేశాడు. దొరికిన అవకాశాన్ని పూరన్‌ చక్కగా వాడుకున్నాడు. మేయర్స్‌ దూకుడుగా ఆడుతుంటే అతడు నిలకడగా ఆడాడు. రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం అందించాడు.


జట్టు స్కోరు 51 వద్ద మేయర్స్‌ను చాహల్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత రోస్టన్‌ ఛేజ్‌ (4), రోవ్‌మన్‌ పావెల్‌ (2)ను వెంటవెంటనే అరంగేట్రం స్పిన్నర్‌ బిష్ణోయ్ ఔట్‌ చేయడంతో విండీస్‌ రన్‌రేట్‌ తగ్గింది. దాంతో బౌలర్లను గౌరవిస్తూనే పూరన్‌ సిక్సర్లు బాదుతూ అర్ధశతకం సాధించాడు. ఆరో వికెట్‌కు పొలార్డ్‌తో కలిసి 25 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 18వ ఓవర్లో జట్టు స్కోరు 135 వద్ద పూరన్‌ను హర్షల్‌ పటేల్‌ ఔట్‌ చేసినా ఆఖర్లో పొలార్డ్‌ కొన్ని షాట్లు బాదేయడంతో విండీస్‌ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.