పోలీసులకు సినిమా చూపించాడు. అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో వేలమందిని విచారించేలా చేశాడు. లక్షల కొద్దీ కాల్స్‌ను వినేలా చేశాడు. వేల సీసీ టివి ఫుటేజీని చూసేలా చేశాడు.
మూడు నెలల క్రితం అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఒక మహిళా టీచర్ హత్య సంచలనంగా మారింది. ఈ దోపిడి వెనుక పార్థీ గ్యాంగ్, మధ్యప్రదేశ్ గ్యాంగ్‌లు ఉన్నాయన్న అనుమానం కలిగింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఒకటే విమర్శలు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు సీరియస్‌గా వేట మొదలు పెట్టారు.
తొంబై రోజులుపాటు ఒక అదనపు ఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు డీఎస్సీల పర్యవేక్షణలో ముప్పై మంది అధికారులు... ఖాకీ సినిమాలో హీరో లెక్క తిరిగారు. తొంబై మంది ఈ కేసు విచారణలో శ్రమించారు. ఐదు రాష్ట్రాల్లో తిరుగతూ లక్షల ఫోన్ కాల్స్ విశ్లేషిస్తూ ఐదువేల మంది అనుమానితులను విచారించారు.
మూడు నెలలు తిండి తిప్పలు మానేసి విచారించిన పోలీసులు.. నిందితుడు ఎవరో తెలిసి షాక్ అయ్యారు. సిటీలోనే నిందితుడిని పెట్టుకొని ఊరంతా తిరిగామా అంటూ ఆశ్చర్యపోయారు. ఎక్కడైతే హత్య జరిగిందో అదే పట్టణానికి చెందిన పాత నేరస్థుడే ఈ హత్య చేశాడని తెలిసి బిత్తరపోయారు.
మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత అసలు నేరస్తుడిని అరెస్టు చేసి 58 తులాల బంగారం, 97వేల డబ్బు స్వాధీనం చేసుకొన్నారు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.
అన్ని రాష్ట్రాలు తిరుగుతూ విచారణ చేసిన పోలీసులకు పాత నేరస్థులను దాదాపు 500 మందిపై నిఘా వేశారు. సంఘటనా స్థలంలోని ఫింగర్ ప్రింట్స్, సీసీ టీవీ ఫుటేజీని పోల్చిన అధికారులకు కళ్లు తేలేసే వివరాలు తెలిశాయి. నిందితుడు కదిరికి చెందిన షేక్ షపీవుల్లా(35)గా గుర్తిచారు.
షేక్ షపీవుల్లా మొదట్లో పెట్రోల్ దొంగిలించేవాడు. తర్వాత ఇళ్లలో దొంగతనాలు చేయడంలో దిట్టగా మారాడు. నిందితుడిపై ఇప్పటివరకు పలు కేసులున్నాయ. కర్ణాటకలో కూడా నిందితుడిపై ఏడు కేసులున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఉపాధ్యాయురాలు ఉషారాణిని చంపి దొంగతనం చేయడమే కాకుండా సమీపంలోని టీ స్టాల్ రమణ భార్య శివమ్మపై కూడా దాడి చేశాడు నిందితుడు.
ఈకేసులో నిందితుడి అరెస్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించిని అధికారులను ప్రశంసించాడు జిల్లా ఎస్పీ పక్కీరప్ప. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్థీ గ్యాంగ్ కానీ, మరే ఇతర గ్యాంగుల పని కాదని తేల్చారు. సొంత జిల్లాలో ఉన్న దొంగను గుర్తించే విషయంలో కొంత ఆలస్యం జరిగిన్పటికి నిందితుడు మాత్రం పోలీసులకు దండుపాళ్యం సినిమా చూపించాడు.