కేంద్రంలో బీజేపీ ( BJP )  మళ్లీ అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారని మంత్రి కేటీఆర్ ( KTR ) సంచలన ప్రకటన చేశారు.  "బీజేపీ నాయ‌కులు చేస్తున్న లొల్లికి పొర‌పాటున యువ‌త ఆగ‌మైతే మ‌ళ్లీ తెలంగాణ‌ ( Telangana )ను, ఆంధ్రా ( Andhra )  ను ఈ పుణ్యాత్ములు క‌లుపుత‌రు"  అని కేటీఆర్ నిజామాబాద్‌  పర్యటనలో వ్యాఖ్యానించారు. కేంద్రం స‌హ‌క‌రించినా, స‌హ‌క‌రించ‌క‌పోయినా తెలంగాణ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం అనేక పోరాటాలు, ఉద్య‌మాలు చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని అలాంటి తెలంగాణ పుట్టుక‌ను మోదీ ( PM Modi )ప్ర‌శ్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 


క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ ప‌ట్ల ఇంత క‌క్ష‌, వివ‌క్ష ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఈ దేశంలో భాగమేనని తెలంగాణ పుట్టుక‌నే ప్ర‌శ్నించిన పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్ట‌గ‌తులు ఉండాలా.. తరిమికొట్టాలా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు.  తెలంగాణ‌లో పుట్టిన బీజేపీ నాయ‌కుల‌కు ( BJP Leaders ) ఏ రోగం వ‌చ్చిందని ప్రశ్నించారు.  ఎంత‌సేపు మోదీ భ‌జ‌న చేయ‌డ‌మే కానీ తెలంగాణ కోసం నిలదీసే ప్రయత్నం చేయరా అని ప్రశ్నించారు. 


విభజన చట్టంలో గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలోనే స్ప‌ష్టంగా చెప్పారు. ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ( Tribal University ) పెట్ట‌రు కానీ వాట్సాప్ యూనివ‌ర్సిటీని దివ్యంగా న‌డుపుతున్నారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచ‌రు. వీట‌న్నింటిని ప్ర‌శ్నిస్తే కేంద్రం నుంచి ఉలుకు ప‌లుకు లేదు. యూపీకి, ఉత్త‌ర భార‌త్‌కే మోదీ ప్ర‌ధాని మంత్రని కేటీఆర్ విమర్శించారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను అమ్మేస్తున్నారని ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేసి.. మనల్ని కూడా అమ్మేస్తారని సెటైర్లు వేశారు.  


నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మంత్రి కేటీఆర్ రూ. 120 కోట్ల వ్య‌యంతో నిర్మించే సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్  ( Siddapur ) నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.  కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మెడిక‌ల్ కాలేజీలు, గురుకుల పాఠ‌శాల‌లు మంజూరు చేశాం. ఆగ‌మాగం అవొద్దు.. ఆలోచ‌న‌తో ఉండండి. తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని బీజేపీ నాయ‌కుల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.