IND vs WI 1st T20, 1 inning Highlights: వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమ్‌ఇండియా అద్దరగొట్టింది! ఆతిథ్య జట్టుకు 191 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (64; 44 బంతుల్లో 7x4, 2x6) దుమ్మురేపాడు. చాన్నాళ్ల తర్వాత తనలోని హిట్‌మ్యాన్‌ను బయటకు తీశాడు. అతడికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ (24; 16 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (41*; 19 బంతుల్లో 4x4, 2x6) భారీ షాట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అరంగేట్రం బౌలర్ అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశాడు. బ్రియన్ లారా స్టేడియంలో తొలి ఇన్నింగ్ సగటు స్కోరు 141 కావడం గమనార్హం.
మొదట్లో హిట్‌మ్యాన్
మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది! రిషభ్ పంత్ (14)కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్‌కు వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 28 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4.4వ బంతికి సూర్యను హుస్సేన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే శ్రేయస్ (0)ను మెకాయ్ పెవిలియన్‌కు పంపించాడు. పంత్ సైతం కాసేపే అలరించాడు. హార్దిక్ (1) నిరాశపరిచాడు.
ఆఖర్లో డీకే
ఒకవైపు వికెట్లు పడుతున్నా హిట్‌మ్యాన్ మాత్రం మంచి టచ్‌లో కనిపించాడు. సునాయసంగా బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరు 127 వద్ద అతడిని హోల్డర్ ఔట్ చేశాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (13)తో కలిసి దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) రెచ్చిపోయాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 25 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం అందించాడు. నిలదొక్కుకొనేందుకు కొన్ని బంతులు తీసుకున్న అతడు ఆఖరి రెండు ఓవర్లు సిక్సర్లు, బౌండరీలతో స్కోరును 190/6కు చేర్చాడు.