IND vs SL T20 Series: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా వైట్ వాష్ చేసింది. శ్రీలంక సిరీస్ వరుసగా రెండో వైట్ వాష్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. టీమిండియా 16.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇది టీమిండియాకు వరుసగా 12వ విజయం కావడం విశేషం. వరుస విజయాల్లో ఆఫ్ఘనిస్తాన్ రికార్డును టీమిండియా సమం చేసింది. మరొక్క విజయం సాధిస్తే... అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా నిలవనుంది.
ఆడుతూ... పాడుతూ...
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియాకు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (5: 9 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ దూరం అవ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన సంజు శామ్సన్ (18: 12 బంతుల్లో, మూడు ఫోర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (73 నాటౌట్: 45 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీరు రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు.
ఏడో ఓవర్లో శామ్సన్‌ను అవుట్ చేసి కరుణ రత్నే లంకకు రెండో వికెట్ అందించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కాసేపు వేగంగా ఆడి 11వ ఓవర్లో లహిరు కుమార వేసిన యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వెంటనే అవుట్ కావడంతో భారత్ 103 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో (22 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ను ముగించాడు. ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. మధ్యలో వికెట్లు కోల్పోయినా... శ్రేయస్ వేగంగా ఆడటం, లక్ష్యం తక్కువగా ఉండటంతో భారత్‌పై పెద్దగా ఒత్తిడి పడలేదు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లు తీయగా... చమీర, కరుణ రత్నేలకు చెరో వికెట్ దక్కింది.
షనక మాత్రమే...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నాలుగు ఓవర్లలో 11 పరుగులకే టాప్-3 బ్యాట్స్‌మెన్ పతుం నిశ్శంక (1), దనుష్క గుణతిలక (0), చరిత్ అసలంక (4) వికెట్లను కోల్పోయింది. నిశ్శంక, అసలంకల వికెట్లు అవేష్ ఖాన్‌కు దక్కగా... గుణతిలకను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రన్‌రేట్ కూడా చాలా మందగించింది.
అనంతరం తొమ్మిదో ఓవర్లో జనిత్ లియనగే (9) కూడా అవుట్ కావడంతో... 29 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. వికెట్ కీపర్ దినేష్ చండీమాల్, కెప్టెన్ దసున్ షనక (74 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించిన అనంతరం చండీమాల్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని హర్షల్ పటేల్ విడదీశాడు.
కెప్టెన్ షనకకు చమీర కరుణరత్నే (12 నాటౌట్: 19 బంతుల్లో) జతకలిశాడు. కరుణ రత్నే క్రీజులో ఎంతో ఇబ్బందిగా కనిపించినా షనక మాత్రం చెలరేగిపోయాడు. మొదటి మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన అవేష్ ఖాన్ నాలుగో ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. షనక, కరుణ రత్నే ఆరో వికెట్‌కు 47 బంతుల్లోనే 86 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 69 పరుగులను శ్రీలంక సాధించింది. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అవేష్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.