టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు వేదిక మారనుంది! మొహాలి క్రికెట్ మైదానం ఈ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసింది. బెంగళూరులోని చిన్నసామిలో ఈ మ్యాచ్ జరగడం లేదని సమాచారం.
ప్రస్తుతం టీమ్‌ఇండియా వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుల్లో తలపడుతోంది. ఇది ముగిసిన వెంటనే లంకేయులు భారత పర్యటనకు వచ్చేస్తారు. రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనున్నారు. కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల ఈ షెడ్యూలును రివర్స్ చేశారని తెలిసింది. విండీస్ సిరీసుకు సైతం అలాగే చేశారు. గతంలో వేర్వేరు వేదికలను ప్రకటించినా ఇప్పుడు వన్డేలను అహ్మదాబాద్, టీ20లను కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు.
Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?
Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్ కమిటీ ప్రకటన
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడాడు. వాస్తవంగా అతడు దక్షిణాఫ్రికాలోనే వంద టెస్టుల ఘనత అందుకోవాలి. కానీ వెన్ను నొప్పి కారణంగా మూడింట్లో రెండు టెస్టులే ఆడాడు. దాంతో శ్రీలంక టెస్టు వరకు అభిమానులు ఎదురు చూడాల్సి వస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగులో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే సంగతి తెలిసిందే. అతడికి ఇష్టమైన మైదానాల్లో చిన్నసామి ఒకటి. దాంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. శ్రీలంకతో తొలి టెస్టు అక్కడే జరగాల్సింది. కొత్త షెడ్యూలు ప్రకారం శ్రీలంక మొదట టీ20లు ఆడనుంది. తొలి మ్యాచ్‌కు లక్నో, చివరి రెండు మ్యాచులకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి నుంచి రెండు జట్లు పంజాబ్ క్రికెట్ సంఘానికి చెందిన మొహాలికి వెళ్తాయి. మార్చి 3-7 తొలి టెస్టు ఆడతాయి. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చిన చిన్నసామిలో రెండో టెస్టులో తలపడతాయి. అయితే ఈ మ్యాచ్ గులాబి బంతితో డే/నైట్‌లో జరుగుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.