Ravindra Pushpa: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'తగ్గేదే లే' (Ravindra Pushpa) అంటూ సందడి చేస్తున్నాడు. నిన్నా మొన్నటి వరకు సోషల్ మీడియాలో 'పుష్ఫరాజ్'గా హడావిడి చేసిన అతడు గురువారం ఏకంగా క్రికెట్ మైదానంలోనే 'తగ్గేదే లే' అన్నాడు. శ్రీలంకతో మ్యాచులో వికెట్ పడగొట్టగానే పుష్ఫ సినిమాలో అల్లు అర్జున్ తరహాలో చేతిని గడ్డకింద నుంచి పోనిస్తూ సంజ్ఞలు చేశాడు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.
సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కొన్నాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడుతుండటంతో మూడు నెలల ముందు గాయపడ్డాడు. దాంతో న్యూజిలాండ్ సిరీస్ నుంచి అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహబిలిటేషన్‌కు వెళ్లాడు. శ్రీలంకతో తొలి టీ20లో పునరాగమనం చేశాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు పెద్దగా అవకాశం రాలేదు. అయితే బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి 28 పరుగులు ఇచ్చాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ (IND vs SL) పదో ఓవర్లో దినేశ్ చండిమాల్‌ను జడ్డూ ఔట్ చేశాడు. వెంటనే అతడు పుష్ఫలా చేతిని తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. మ్యాచుకు కామెంట్రీ చేస్తున్న దినేశ్ కార్తీక్ అతడిని పొగిడేశాడు. 'ఒకసారి అటు చూడండి. అతనెలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడో చూడండి. ఎక్కడో మనం చూసినట్టు ఉంది కదా! అతడే రవీంద్ర పుష్ఫ' అంటూ వ్యాఖ్యానించాడు. వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకు ముందు కూడా పుష్ఫ పోస్టర్లను జడ్డూ రీక్రియేట్ చేశాడు.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో విచిత్రమైన సంబరాలు చేసుకోవడంలో కరీబియన్లు ముందుంటారు. రకరకాలుగా వేడుకలు చేసుకుంటారు. క్రిస్‌గేల్, డ్వేన్ బ్రావో వంటి క్రికెటర్ల సంబరాలు చూసేందుకు అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తారు.
ఇక శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా (Team India) 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) (Ishan Kishan), శ్రేయస్ అయ్యర్ (57 నాటౌట్; 28 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) (Shreyas iyer) చెలరేగడంతో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (53 నాటౌట్: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు.