IND vs SL: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇందులో ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులే చేయగలిగాడు.


ఈ సిరీస్‌కు ముందు కూడా టీ20 ఇంటర్నేషనల్‌లో ఇషాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గత 10 ఇన్నింగ్స్‌లలో అతని సగటు, స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ ప్రదర్శన చూస్తుంటే శ్రీలంకతో జరిగే తదుపరి మ్యాచ్ నుంచి ఇషాన్‌ను తప్పించే ప్రమాదం లేకపోలేదు.


ఇషాన్ గత 10 మ్యాచ్‌ల రికార్డు
ఇషాన్ తన చివరి 10 T20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో 17.50 సగటు, 118.24 స్ట్రైక్ రేట్‌తో కేవలం 175 పరుగులే చేశాడు. ఇందులో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 40 పరుగుల మార్కును కూడా దాటలేదు. అతని అత్యధిక స్కోరు శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 37 పరుగులు.


ఈ 10 ఇన్నింగ్స్‌లలో అతను 27, 15, 26, 3, 8, 11, 36, 10, 37, 2 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ గణాంకాలు భారత జట్టుకు సమస్యగా ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీలంకతో ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత ఓపెనర్లు విఫలమయ్యారు.


సిరీస్ 1-1తో సమమైంది
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో శ్రీలంక రెండో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ జనవరి 7వ తేదీన శనివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను అందుకోనున్నాయి.


భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితం అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసింది.