ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. అకౌంట్ రీస్టోర్ అయ్యే వరకు తన ఖాతా నుంచి వచ్చే కంటెంట్‌కు ఎంగేజ్ కావద్దని మనోజ్ నెటిజన్లను కోరారు. ‘నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు నా ప్రొఫైల్‌లో వచ్చే పోస్టులతో ఎంగేజ్ అవ్వద్దు.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అయితే మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ ఖాతా నుంచి ఎటువంటి కంటెంట్ ఆ తర్వాత పోస్ట్ కాలేదు. 18 గంటల క్రితం చేసిన ఒక రీట్వీట్‌ను మాత్రమే ఇప్పటికీ తన ఖాతాలో చూడవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో చలి పెరుగుతున్న కారణంగా రోడ్డు పైన ఉండే జీవులకు షెల్టర్ కల్పించాలని చేసిన ఒక మెసేజ్‌ను ఆయన రీట్వీట్ చేశాడు.
మనోజ్ బాజ్‌పాయ్ ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో ప్రేక్షకులను పలకరించాడు. దీంతోపాటు రే, డయల్ 100, సైలెన్స్... కెన్ యు హియర్ ఇట్? వంటి వెబ్ సిరీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డిస్పాచ్, గుల్మోహర్, జోరం సినిమాలు ఉన్నాయి.
మనోజ్ బాజ్‌పాయ్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. 1999లో వచ్చిన ‘ప్రేమకథ’ తెలుగులో ఆయన మొదటి సినిమా. అప్పటికే దౌడ్, సత్య లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ, కొమరం పులి సినిమాల్లో కూడా మనోజ్ కనిపించారు.