తెగేవరకు లాగొద్దని ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంత్రి రోజాను హెచ్చరించారు. అయినా సరే తగ్గేదే లే అని రోజా తన స్టైల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు పవన్నే టార్గెట్‌ చేసిన రోజా ఇప్పుడు మెగా బ్రదర్స్‌ ని మళ్లీ టార్గెట్‌ చేశారు. వైసీపీ నేతల్లో ఫైర్‌ బ్రాండ్‌ గా మంత్రి రోజాకి పేరుంది. జగన్‌ పై ఎవరు విమర్శలు చేసినా ముందుగా స్పందించడమే కాదు తీవ్ర పదజాలంతో మాట్లాడే నేతల్లో ముందుగా మంత్రి రోజానే ఉంటారు. ఇప్పుడు మరోసారి జనసేన అధినేతని టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన రోజాపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1పై విపక్షాలు నిరనస వ్యక్తం చేస్తూ ఇప్పటికే కోర్టుని కూడా ఆశ్రయించాయి. అంతేకాదు అధికారపార్టీ తీరుని విమర్శించడంతో వైసీపీ నేతలు రియాక్ట్‌ అయ్యారు. ర్యాలీలు, రోడ్‌ షోలతో ప్రజలు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేనలను టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు దత్త పుత్రుడిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గుంటూరు, కందుకూరు ఘటనలపై సానుభూతి చూపించాల్సిన పవన్‌ కల్యాణ్‌ ఆ విషయం మరిచి జీవో నెంబర్‌ 1ని తప్పుబట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు. బాబుగారు తప్పుచేసినప్పడల్లా దత్తపుత్రుడునోటికి ప్లాస్టర్‌ వేసినట్లు మౌనంగా ఉంటాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఆర్టిస్ట్‌ లు స్వతహాగా సెన్సిటివ్‌ గా ఉంటారని అయితే మానవత్వం లేని మనిషి పవన్‌ కల్యాణ్‌ అని చెబుతూ ఓ ఆర్టిస్ట్‌ గా సిగ్గుపడుతున్నానన్నారు. ఇంతటితో ఆగలేదు సొంతూరికి ఏమీ చేయలేకపోవడం వల్లే ముగ్గురు అన్నదమ్ములను ఓడించారన్నారు. 


మెగా బ్రదర్స్ ను టార్గెట్ చేసిన మంత్రి రోజా


మళ్లీ రోజా మెగా బ్రదర్స్‌ ని ముఖ్యంగా చిరంజీవిని టార్గెట్‌ చేయడం వెనక ఉన్న కారణమేంటన్నదానిపై జోరుగా చర్చనడుస్తోంది. ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన తమ్ముడిపై వస్తోన్న విమర్శలపై స్పందించారు. రాజకీయ మురికికూపంలో ఉన్న తన తమ్ముడిపై  విమర్శలు వచ్చినప్పుడు బాధగా అనిపిస్తుందన్నారు. తన తమ్ముడిని తిట్టిన వారు మళ్లీ తన దగ్గరికి వచ్చి శుభకార్యాలు, ఈవెంట్లకి పిలుస్తున్నప్పుడు తప్పక వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత ఉన్న పవన్‌ కల్యాణ్‌ కి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని, భవిష్యత్‌ లో ప్రజల ఆశీస్సులు ఉంటే పాలనాపగ్గాలు అందుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ భవిష్యత్‌ కి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న కారణంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ రివెంజ్‌ తీర్చుకోవాలనుకుంది కానీ సరైన సమయం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రోజా అందిపుచ్చుకొని ఈ కామెంట్లు చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడీ విమర్శలే మెగా ఫ్యాన్స్‌ కోపానికి కారణమవుతున్నాయి.


రోజాకు చిరు అభిమానులు మెగా కౌంటర్లు


ఓ ఆర్టిస్ట్‌ గానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా చిరంజీవి కరోనా టైమ్‌ లో బ్లడ్‌ బ్యాంక్‌, ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా చేసిన సాయం  గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉచిత ఆక్సిజన్‌ సిలెండర్లను జిల్లాలకు పంపిన విషయం గుర్తు లేదోమో కానీ ప్రజలకు తెలుసునన్నారు. అంతేకాదు కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ ని కూడా మెగా కుటుంబం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అభిమానులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా మెగా కుటుంబం అన్ని సమయాల్లో ఆసారాగా ఉందని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఇలానే బ్లడ్‌ బ్యాంక్‌ పై రోజా ఆరోపణలు చేయడం, ఆ తర్వాత చిరంజీవికి క్షమాపణ చెప్పారు. వీటిని కూడా మరోసారి గుర్తు చేస్తూ నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ గుట్టంతా బయటపెడతామని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు.