Team India Predicted Playing XI For 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 15వ తేదీన జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకను వైట్ వాష్ చేయాలనే ఉద్దేశ్యంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో దిగనుంది.
మరోవైపు చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గౌరవంగా ముగించాలని శ్రీలంక భావిస్తోంది. జనవరి 10వ తేదీన గౌహతిలో, జనవరి 12వ తేదీన కోల్‌కతాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మూడో వన్డేలో టీమ్ ఇండియాలో కనీసం నాలుగు మార్పులను చూడవచ్చు.
వీరికి అవకాశం దక్కవచ్చు
శ్రీలంకతో జరిగే మూడో మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు జరగవచ్చు. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇషాన్ కిషన్ కూడా మూడో వన్డేలో అవకాశం పొందవచ్చు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించి తిరిగి జట్టులోకి రావాలని ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లను కూడా మూడో వన్డేలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు.
చరిత్ర సృష్టించడానికి సిద్దంగా భారత్
మూడో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఏదైనా ఒక దేశంపై వన్డేల్లో భారత్, ఆస్ట్రేలియా సంయుక్తంగా 95-95 మ్యాచ్‌లు గెలిచాయి. మూడో వన్డేలో శ్రీలంకను చిత్తు చేస్తే టీమిండియా ఈ విషయంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టినట్టే. తద్వారా వన్డే చరిత్రలో ఏదైనా ఒక దేశంపై అత్యధిక విజయాలు సాధించిన దేశంగా భారత్ అవతరిస్తుంది. న్యూజిలాండ్‌పై 141 వన్డేల్లో ఆస్ట్రేలియా 95 విజయాలు సాధించింది. శ్రీలంకపై భారత్ 164 వన్డేల్లో 95 విజయాలు సాధించింది.
మూడో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.